“రాజకీయాల్లో నేను ఉన్నా.. నిజమే మాట్లాడతా.. ఎందుకంటే.. నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు.. పక్షపాతానికి వ్యతిరేకం. ఈ రోజు నాకు పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. నేను నిజమే చెబుతా.. నా నాలుక కోస్తానన్నా..బీసీలకు మంచి చేసిన చంద్రబాబు గురించి మాట్లాడకుండా ఉండలేను” గతంలో ఎన్నికలకు ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడి హోదాలో మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు.
అయితే, ఇప్పుడు ఆయన టీడీపీకి సానుకూలంగా లేరు. దీంతో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను పూర్తిగా మరిచిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా ఆయన వైసీపీ అధినేత, తనకు రాజ్యసభ సీటును ఇచ్చిన జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదేసమయంలో చంద్రబాబుతనయుడు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌పై చిందులు తొక్కారు.
లోకేశ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు బీసీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదనే విషయం అర్థమవుతోందని ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, సీఎం వైఎస్ జగన్ తగ్గించారంటూ లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. కానీ, ఇదే విషయాన్ని గతంలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు.. ఎన్నికల సమయంలో ఈయనే ప్రచారం చేశారు.
కానీ, తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తే సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారని అన్నారు. ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపని చంద్రబాబు.. బీసీలకు 34% రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని లోకేశ్‌ను ప్రశ్నించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లకు మించి పార్టీ పరంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. అయితే.. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన మరిచిపోయినా.. ఆయన మద్దతు ఉన్నారని చెబుతున్న బీసీలు మాత్రం మరిచిపోలేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates