రాజకీయ పార్టీల నేతలు ఒకరినొకరు రాజకీయంగా ఎంతైనా విమర్శించుకోవచ్చు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి దారుణాతి దారుణమైన మాటలు అనుకోవడం.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళల పేర్లు తెచ్చి నీచమైన ఆరోపణలు చేయడం.. విషాదకరమైన విషయాల మీద అవతలి వాళ్ల మనోభావాలు పట్టించుకోకుండా వెటకారాలు ఆడడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చూస్తున్నాం. ఇలాంటి పెడ పోకడలను ప్రధానంగా పెంచి పోషిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనడంలో సందేహమే లేదు.
ఆ పార్టీ నేతలు పూర్తిగా హుందాతనం మరిచి రకరకాల సందర్భాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యుల మీద.. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎన్నెన్ని చీప్ కామెంట్లు చేశారో తెలిసిందే. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న నందమూరి తారకరత్న గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి.
లోకేష్ ఐరెన్ లెగ్ అని, అందుకే అతను పాదయాత్ర చేసిన మొదటి రోజే తారకరత్న గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలయ్యాడని అనిల్ కుమార్ వ్యాఖ్యానించాడు. ఐతే వైసీపీ నుంచి ఇలాంటి ఆరోపణలు ఎవరికీ ఆశ్చర్యం కలిగించవు. కానీ ఈ ఆరోపణ చేస్తూ ఆయన అన్న మాటలు, వెకిలి నవ్వులే చూసేవారికి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తారకరత్నకు గుండెపోటు రావడం గురించి అనిల్ మాట్లాడుతూ.. ‘‘అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంటిరి. మనాయన పాదం పెడితే నందమూరి కుటుంబ సభ్యుల్ని ఆసుపత్రికి పంపిస్తుంటిరి. ఏమిరా నాయనా ఈ పాదాలు. చెప్పు.. మనం పాదం పెట్టామో లేదో వోడికి స్టంటంట. ఎందుకురా నాయనా. మీ తాత దగ్గర్నుంచి పార్టీ లాక్కుంటిరి. నందమూరి కాస్తా నారా ఆయ. నందమూరిని పక్కకు తోసేసి నారా స్టాంపు వేసేస్తిరి. నందమూరి వాళ్లు తోకల్లా తిరుగుతున్నారు ఎనకాల. లాస్టుకి వాళ్లొచ్చిన పాపానికి నేరుగా పైకి పంపిచ్చేస్తా ఉండారు’’ అంటూ చేత్తో పైకి చూపిస్తూ మృత్యువుతో పోరాడుతున్న తారకరత్న గురించి వ్యాఖ్యానాలు చేశాడు అనిల్.
ఈ మాటలు అంటున్నంతసేపూ ఆయన నవ్వుతూనే ఉన్నాడు. చుట్టూ ఉన్న నాయకులు కూడా గట్టిగా నవ్వుతూ కనిపించారు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నా సరే.. అవతల ఒక వ్యక్తి ప్రాణాలతో పోరాడుతుంటే.. ‘‘వోడికి స్టంటంట.. పైకి పంపిచేస్తా ఉండారు’’ లాంటి మాటలు మాట్లాడడం అనిల్‌కే చెల్లింది. చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి ప్రస్తావిస్తూ కూడా అనిల్ ఇలాగే వెకిలి నవ్వులు నవ్వడం గమనార్హం. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ప్రపంచంలో ఇంకెక్కడైనా చూస్తామా అన్నది సందేహమే.