ఏపీ స‌ర్కారు పై మండిప‌డ్డ ర‌మ‌ణ దీక్షితులు..

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని పూజ‌లు, యాగాలు చేసిన ఒక‌ప్ప‌టి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు ఇప్పుడు అదే స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. త‌ర‌చుగా ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఏపీలో హిందూ ధ‌ర్మం మంట‌గ‌లిసింద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాల‌యాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు దీక్షితులు ట్వీట్ చేశారు. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని తప్పుబట్టారు.

ఆలయ అధికారులు సొంత ప్రణాళికలను అమలు చేస్తున్నారని, ఆలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్‌లో రమణ దీక్షితులు తప్పుబట్టారు. నిజానికి దీక్షితులు.. గ‌త టీడీపీ ప్ర‌బుత్వంపై నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారు కొలువుదీరాల‌ని ఆకాంక్షించారు. ముఖ్యంగా టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులుగా త‌న‌ను తొల‌గించ‌డం ప‌ట్ల అప్ప‌ట్లో ఆయ‌న నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ వ‌చ్చాక త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. అయితే.. అది సాధ్యం కాలేదు.

ఇక‌, ఏపీలో వైసీపీ సర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. సీఎం జగన్ ను విష్ణుమూర్తికి ప్రతిరూపమంటూ దీక్షితులు కొనియాడారు. సనాతన ధర్మం అంతమవుతున్న దశలో విష్ణుమూర్తిలా జగన్‌ ధర్మాన్ని రక్షిస్తున్నారన్నారు. ఏడాది కింద‌ట‌ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టవస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వచ్చారు. అయితే వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై జగన్, ప్రకటన చేస్తారని రమణ దీక్షితులు భావించారు.

జగన్ శ్రీవారిని దర్శించుకుని ఎలాంటి ప్రకటనా చేయకుండా వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేసి ప్రభుత్వంపై రమణ దీక్షితులు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ‘‘మీ తిరుమల పర్యటన సందర్భంగా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించాము. మీరు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో అర్చకులమంతా తీవ్ర నిరాశ చెందాం“ అని అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా దీక్షితులు త‌ర‌చుగా ఏపీ స‌ర్కారు వైఖ‌రిపై ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కూడా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. టీటీడీలోని అర్చక వ్యవస్థను.. ఆలయ విధానాలను నాశనం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని ఒక‌ప్పుడు విమ‌ర్శ‌లు సంధించారు.

ఇప్పుడు ఏకంగా ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హిందూ ధ‌ర్మానికిచోటు లేకుండా పోయింద‌ని కూడా దుయ్య‌బ‌ట్టారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.