అమూల్ మాటున జ‌గ‌న్ ఆర్థిక దోపిడీ.. లోకేష్

ఏపీలో ప్ర‌వేశ పెట్టిన అమూల్ పాల డెయిరీ మాటున సీఎం జ‌గ‌న్ ఆర్థిక దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పంలో మూడో రోజు ఆదివారం కూడా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక‌ పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల క‌ష్టాలు విన్నారు. ఓపిక‌గా వాట‌న్నింటినీ.. రికార్డు చేసుకున్నారు. అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ.. అమూల్ రాక‌తో.. రాష్ట్రంలో పాడి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామని నారా లోకేష్ చెప్పారు. అప్ప‌ట్లో పాడి రైతులకు సబ్సిడీపై దాణా, సైలేజ్(ఎండు గ‌డ్డి) తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని చెప్పిన జ‌గ‌న్‌.. రైతుల‌ను మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు, ఒంగోలు డైయిరీలను అమూల్‌ డైరీకి కట్టబెట్టారని, రూ.650 కోట్ల విలువైన చిత్తూరు డైయిరీని అమూల్‌కి కట్టబెట్టడం ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందార‌ని విమ‌ర్శించారు. రైతుల పేరుతో రూ.3 వేల కోట్లు అప్పుతీసుకొని అమూల్‌కి కట్టబెడుతున్నారని, దీనిలోనూ క‌మీష‌న్లు బొక్కేశార‌ని లోకేష్‌ దుయ్యబట్టారు. పాడి రైతుల పేరుతో జగన్‌రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్‌ సర్కార్‌ ఉందని విమర్శించారు. పాడిరైతులకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెరిగేలా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు.