పంచ్ లైన్ ఉంటే ఇంకా సూపర్

లోకేష్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యువగళానికి వస్తున్న విశేష స్పందన, లోకేష్ ను చూసేందుకు తరలి వస్తున్న అశేష జనవాహినిని చూసి తెలుగు దేశం శ్రేణులు ఉబ్బితబ్బిబవుతున్నాయి. తొలి అడుగు వేసినప్పటి నుంచి లోకేష్ వెంట వేలాది మంది నడుస్తున్నారు. అక్కడక్కడా మామగారు బాలయ్య తళుక్కున మెరుస్తున్నారు. ఎక్కడిక్కడ మహిళలు హారతులు పట్టి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని దీవిస్తున్నారు. చేతులు కలిపేందుకు కొందరు పోటీ పడుతున్నారు. ఎవరినీ నొప్పించకుండా, అందరినీ ఒప్పించుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. నలుగురు ఆపితే ఆగి, వారి వద్ద వినతిపత్రాలు తీసుకుని, వారి బాగోగులు తెలుసుకుని, వారు సంతృప్తి చెందారన్న నమ్మకం కుదిరిన తర్వాతే లోకేష్ ముందుకు కదులుతున్నారు..

బహిరంగ సభ స్పీచ్ అదుర్స్

యువగళం తొలిరోజున నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ స్పీచ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. దాదాపు 40 నిమిషాలు సాగిన స్పీచ్ లో జగన్ రెడ్డి తప్పిదాలను ఏకరవు పెట్టారు. ఇసుక ఎలా తరలిపోతోందో చెప్పారు. జగన్ ఒక జాదూ రెడ్డి అంటూ కొత్త నినాదాన్ని లేవనెత్తారు. అంతకు మించి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఏం చేయబోతున్నామో చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేట్లు చెప్పారు. మహిళలను తన ఇంటి ఆడబిడ్డలుగా చెప్పుకున్నారు.యువత అంత తనవైపు ఉండేట్టుగా చూసుకున్నారు..

పంచ్ లైన్ చాలా అవసరం

ఒక నాయకుడి స్పీచ్ జనంలో చిరస్థాయిగా ఉండాలంటే దానిలో కొంతైనా పంచ్ లైన్ ఉండాలి. ఈ సారి ఫలానా నాలుగు డైలాగులు భలేగా ఉన్నాయని జనం రోజుల తరబడి చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ ప్రతీ సారీ అలాంటి పని చేస్తుంటారు. ఆయన స్థాయిలో చెప్పు తీసుకు కొడతా… అని కాకపోయినా లోకేష్ ఇప్పుడు పవర్ ఫుల్ డైలాగులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అందులో కొంత ప్రాస ఉంటే జనం బాగా గుర్తుపెట్టుకుంటారు. రోజాకు డైమండ్ రాణి అని పేరు పెట్టినదీ వవన్ కల్యాణేనని మరిచిపోకూడదు. ఆ మాట జనంలోకి బాగా వెళ్లిపోయింది. లోకేష్ కూడా అలాంటి డైలాగులు వదలితేనే ఉపయోగం. పవన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు స్క్రిప్ట్ రాసిస్తున్నారు. లోకేష్ కూడా తన కోసం పంచ్ డైలాగులు రాసే స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకుంటే బావుంటుంది.