ఆ హీరో బీఆర్ఎస్ లో చేరతారా ?

దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్తూ బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత అందరి చూపు హైదరాబాద్ వైపుకు మళ్లింది. వేర్వేరు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను నిలబెట్టే ప్రక్రియ వేగవంతం కాగా, ఇప్పుడు కేసీఆర్ చూపు ఒడిశా వైపు మళ్లింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ నేతృత్వంలోని ఒక బృందం ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరింది.

కవిత కలిసిన శరత్ కుమార్

సీనియర్ నటుడు, ఒకప్పటి మిస్టర్ మద్రాస్, శరత్ కుమార్ ఇప్పుడు కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలతో పాటు బీఆర్ఎస్ లో చేరికల వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. నటి, రాడాన్ అధినేత రాధిక భర్తే శరత్ కుమార్. ఆయన సమత్తువ మక్కళ్ కట్చి అనే పార్టీని నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది.అంతకముందు ఆయన డీఎంకే, అన్నాడీఎంకేతో కూడా పొత్తుగా పోటీ చేశారు.

శరద్ కుమార్ తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినా ఆశ్చర్యం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఎందుకంటే తమిళనాడులో బీఆర్ఎస్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ వేడుకలకు లోక్ సభ సభ్యుడైన విడుదలై సిరుతై కట్చి వ్యవస్థాపకుడు తిరుమా వలవన్ వచ్చి వెళ్లారు. తర్వాత నాడారా సంఘాల సమాఖ్య నేతలు వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. తమిళనాడులో తెలంగాణ తరహాలో కల్లు గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ను నాడార్ సంఘాలు కోరాయి. ఇప్పుడు శరద్ కుమార్ వచ్చి కవితను కలిశారు. శరద్ కుమార్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఓడిపోయినా ఆయన పాపులర్ నాయకుడేనని చెప్పాలి. జనంలో మంచి పేరుంది. అవినీతిపరుడు కాదన్న అభిప్రాయమూ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి..