బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.
ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు. గుడిలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం అని మాత్రం చెప్పారు.
ఏపీలోకి తొలిసారి తీసుకొచ్చిన వారాహి వాహనం నుంచి మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ ఏంటో అనౌన్స్ చేశారు. వారాహిని ఎందుకు సిద్ధం చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఏపీలో రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.
పవన్ కళ్యాణ్‌కు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో శ్రీమతి భ్రమరాంబ, ఆలయ అధికారులు, వేద పండితులు ఆయన్ను అంతరాలయంలోంచి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేయించారు.
కాగా పవన్ నిన్న తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ పోటీ చేస్తామని.. 7 నుంచి 14 సీట్లకు తెలంగాణలో పోటీపడతామని చెప్పారు. ఏపీలో పొత్తులు కూడా పరిస్థితులను బట్టి మారుతాయని చెప్తూనే బీజేపీతో ఇంకా పొత్తుల్లోనే ఉన్నట్లు తెలిపారు.
అయితే.. ఏపీ విషయానికి వచ్చేసరికి ఆయన అటు బీజేపీ, ఇటు టీడీపీతో కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా బీజేపీ, టీడీపీలు కలిసే అవకాశం కనిపించకపోవడంతో ఎన్నికల నాటికి ఏపీలో పొత్తులు ఎలా ఉంటాయా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో పవన్ త్వరలో దీనిపైనా క్లారిటీ ఇస్తారన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates