లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తారా? ఇవ్వరా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. పాదయాత్ర ఏఏ నియోజకవర్గాలలోంచి వెళ్లాలి.. ఎన్ని రోజులు సాగాలి వంటివన్నీ ఇప్పటికే నిర్ణయించుకోవడంతో అనుమతులు రాగానే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడానికి టీడీపీ రెడీ అవుతోంది. అనుమతుల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ వర్ల రామయ్య జనవరి 12న ఏపీ డీజీపీ, హోం శాఖ సెక్రటరీ చిత్తూరు ఎస్పీలను అనుమతి కోరుతూ లేఖలు రాశారు. దానిపై అధికారుల నుంచి ఇంతవరకు స్పందన లేకపోవడంతో మరోసారి ఆయన రిమైండర్ పంపించారు.

పాదయాత్రకు సమయం సమీపిస్తోందని, అనుమతులు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామని చెప్తూ రామయ్య రిమైండర్ పంపించారు. దీనిపైనా ఇంతవరకు స్పందన లేదని టీడీపీ నేతలు చెప్తున్నారు. అనుమతి ఇస్తున్నట్లు కానీ, అనుమతి ఇవ్వడం లేదని కానీ అధికారులు చెప్పకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

లోకేశ్ పాదయాత్ర జనవరి 27న కుప్పంలో మొదలుకానుంది. 26న ఆయన తిరుమలలో దర్శనం చేసుకుని 27 నుంచి యాత్ర ప్రారంభిస్తారు. రోజుకు 10 కిలోమీటర్ల దూరం చొప్పున 400 రోజులలో 4 వేల కిలోమీటర్ల దూరం ఏపీలోని 100 నియోజకవర్గాలలోంచి వెళ్లేలా ఈ యాత్ర ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3 రోజులు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం అనుమతులపై ఎటూతేల్చకుండా నాన్చుతుండడంతో నిరాకరిస్తారమోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

అదేసమయంలో అనుమతులు ఇవ్వకపోయినా లోకేశ్ పాదయాత్ర చేసితీరుతారంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. పాదయాత్రలకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా టీడీపీ నేతలు చెప్తున్నారు. పద్దతి ప్రకారం అనుమతులు అడిగామని.. ఇవ్వకున్నా పాదయాత్ర చేసి తీరుతామని చెప్తున్నారు.

దీంతో జనవరి 27 నాటికి అనుమతులు కనుక రాకుంటే కుప్పంలో మరోసారి యుద్ధం తప్పదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇటీవలే చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు నారా లోకేశ్ పాదయాత్రను కూడా అడ్డుకోవాలని ప్రభుత్వం అనుకుంటే మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడనున్నాయి.