ఆయన పేరుకు మాజీ సీఎం కుమారుడు. కానీ, రాజకీయాల్లో అనుభవం తక్కువ. పైగా ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి వచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం లోకల్ పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఆయనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నేదురు మల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు రామ్. నిజానికి కాంగ్రెస్ హయాంలో దంపతులు ఇద్దరూ చక్రం తిప్పారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు కూడా దక్కించుకున్నా రు. అయితే.. ఇది చరిత్ర. ఒకప్పటికీ.. ఇప్పటికీ తేడా ఉంది. పైగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రామ్.. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీకి రెడీ అవుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనూ ఇదే కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రజలతోముందు సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని.. అప్పట్లో జగన్ చెప్పారు.
మరి అప్పటికి.. ఇప్పటికి కూడా రామ్ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కానీ, ఆయన మాత్రం టికెట్ కోరుకుంటున్నారు. ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. వెంకటగిరిలో 2009, 2014లో టీడీపీ విజయం దక్కించుకుంది. రెడ్డి వర్గంలో సగం మంది గతంలో ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో ఆశలు పెట్టుకుని.. మరీ జగన్ కోసమైనా అన్నట్టుగా ఇక్కడ వైసీపీని గెలిపించారు.
అయితే.. అప్పుడు రెడ్డి వర్గం పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆ వర్గమే తరచుగా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో వెంకటగిరి రెడ్లు.. ఇప్పుడు మరోసారి టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌కు వారు అండగా ఉంటారా? ఉండరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates