మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ.. పోలింగ్ ఎప్పుడంటే!

ఈ ఏడాది దేశంలో మొత్తం 9 రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మూడు రాష్ట్రాల అసెంబ్లీల కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే.. ఈ మూడు కూడా ఈశాన్య రాష్ట్రాలే కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మొత్తం మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చి 2న వెల్ల‌డించ‌నున్నారు.

మూడు రాష్ట్రాల్లో ఒక్కొక్క దానిలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక‌, ఇత‌ర విష‌యాలకు వ‌స్తే.. మూడు రాష్ట్రాల్లో పోలింగ్ 9,125 పోలింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్లను త్రిపురలో ఈనెల 30, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 7 వ‌ర‌కు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. నామినేషన్ల ఉపసంహరణకు త్రిపురలో ఫిబ్రవరి 2, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 10 వ‌ర‌కు అవ‌కాశం ఉంటుంది.

అతి చిన్న రాష్ట్రం త్రిపుర విష‌యానికి వ‌స్తే.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 20 సీట్లు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా.. సీపీఎం 16, ఐపీఎఫ్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. మేఘాలయలోనూ 60 స్థానాలు ఉన్నాయి. ఇక్క‌డ‌ నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. 2018లో ఎన్పీపీ 20 సీట్లలో విజయం సాధించగా.. యూడీపీ 8, టీఎంసీ 8, బీజేపీ 3, ఎన్సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. అత్యంత కీల‌క‌మైన నాగాలాండ్లో ప్రస్తుతం నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీ) ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది.