వైసీపీకి 40-50 సీట్లే.. ఆ ఎంపీగారి జోస్యం అదిరిందిగా!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కు ల‌క్ష్మ‌ణ రేఖ‌, నిర్దిష్ట ల‌క్ష్యం కూడా ఇచ్చారు. అంటే.. రాష్ట్రంలోని 175/175 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టికే ‘వైనాట్ 175’ నినాదంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. దీనిని నాయ‌కులు కూడా నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అదే వైసీపీ ఎంపీ.. రెబ‌ల్ నాయ‌కుడు, క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ఆర్ఆర్‌ మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ కేవ‌లం 40-50 స్థానాల్లో కూడా గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పారు. అంతేకాదు..ఇదేదో ఉత్తుత్తి మాట కాద‌ని.. తాను చేయించిన స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏం చేశార‌ని మాపార్టీ(వైసీపీ)కి ప్ర‌జ‌లు ఓటేస్తార‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకు ప్ర‌జ‌లురెడీగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రస్తుత మ‌నోభిప్రాయంపై సర్వే చేయించానని ఎంపీ తెలిపారు. త్వరలో పూర్తి సర్వే రాబోతుందన్నారు. వైసీపీకి 40-50 కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు.

దీనికి కార‌ణాలు కూడా చెప్పారు. గత ఎన్నికల్లో బాబాయ్ హత్య చాలా ప్రభావం చూపిందన్నారు. అయితే.. అప్ప‌ట్లో ఈ కేసును వైసీపీ నేత‌లు తెలివిగా.. ఆత్మ‌హ‌త్య అని.. చంద్ర‌బాబు ఉన్నార‌ని.. ప్ర‌చారం చేశార‌ని. అయితే.. వివేకా హ‌త్య వెనుక ఎవరు ఉన్నారో.. ఎవ‌రు చంపించారో స్పష్టంగా ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయిందని.. అందుకే జ‌గ‌న్‌ను చీద‌రించుకుంటున్నార‌ని ర‌ఘురామ చెప్పారు. త‌న సొంత బాబాయి కూతురే ఏపీ పోలీసులు, ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం లేద‌ని.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోవ‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అది కూడా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారితీసింద‌ని.. ఎన్నిక‌ల్లో ప్ర‌భావం ఉంటుంద‌ని అన్నారు.

ఇక‌, జ‌న‌సేన అధినేతపై వైసీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆర్ ఆర్ ఆర్ స్పందిస్తూ.. అవినీతి చేయని పవన్‌పై తమ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు గాలికి కొట్టుకుపోతాయ‌న్నారు. పవన్‌పై ఎలాంటి కేసులు లేవని, జ‌గ‌న్‌పై 31 కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టుల కోసం జగన్ ప్ర‌భుత్వం ఖర్చు చేసింది 18 వేల కోట్లు మాత్రమేనని, అయినా కూడా మ‌రో 18 కోట్లు పెట్టి ప్ర‌చారం చేయించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్న త‌న పార్టీ నాయ‌కులు.. ఆయ‌న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని చెప్పగలరా? అని ర‌ఘురామ‌ ప్రశ్నించారు. మొత్తంగా ర‌ఘురామ చెప్పిన సీట్ల జోస్యం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.