జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కోసం.. చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మేమొస్తామంటే.. మీరురానిస్తారా!! అంటూ.. నాయకులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా పాత కాపులే. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన వారే. నిజానికి గత ఎన్నికల్లో 142 స్థానాల్లో నేరుగా జనసేన తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఒక్క రాజోలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఓడిపోయింది.
తర్వాత.. ఈ నాయకుల్లో చాలా చాలా తక్కువ మంది మాత్రమే పవన్ వెంట నిలిచారు. ఇతర మెజారిటీ నాయకులు అందరూ.. ఎగిరిపోయారు. వీరిలో ఎక్కువగా విద్యావంతులు ఉండడం.. ఉన్నతాధికారులు ఉండడం తెలిసిందే. అదే.. గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రజల నాడి మారిన నేపథ్యంలో జనసేన లో చేరుతామంటూ.. పదుల సంఖ్యలో నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మేం వస్తాం.. అంటూ.. పరోక్షంగా జనసేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటు ఆన్‌లైన్ , అటు సోషల్ మీడియా వేదికలుగా.. జనసేన అధినేత పవన్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. ఆయన ప్రసంగాల్లోని కీలకమైన వ్యాఖ్యలను ప్రచారం కూడా చేస్తున్నారు. అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. వీరిలో కమ్మ, కాపు నాయకులు కూడా ఉండడం.. గమనార్హం. మరికొన్ని చోట్ల ఎస్సీ నేతలు కూడా ఉన్నారు. అయితే.. వీరికి పవన్ నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు.
మరోవైపు.. ఆయన ఒంటరి పోరు చేస్తే.. వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చర్చకు దారితీ స్తోంది. ఎందుకంటే.. టీడీపీతో జనసేన పొత్తు అనగానే.. ఎక్కడెక్కడో ఉన్ననాయకులు.. బిలబిలా బయటకు వస్తున్నారు. కానీ, నేరుగా మాత్రం.. ఎవరూ కలిసేందుకు ముందుకు రావడం లేదు. ఘర్ వాపసీ ప్రకటన చేయాలని కోరుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ, పవన్ నుంచి అలాంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పాతకాపులకు ఏం చేయాలో తోచడం లేదు. మరి పవన్ ఇప్పటికైనా.. ఏదో ఒకప్రకటన చేస్తే.. ఇలాంటివారికి కొంత ఊరట ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates