రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన అన్నగారి అల్లుడు

తెలుగు వారి అన్న‌గారు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క రామారావు పెద్ద అల్లుడు, మాజీ మంత్రి ద‌గ్గు బాటు వెంక‌టేశ్వ‌ర‌రావు తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను, త‌న కుమారుడు(ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న చెంచురామ్‌) రాజ‌కీయాల నుంచి విర‌మించుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. “డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందాం. అందుకనే ఇక మా కుటుంబంలో నేను కానీ, మా కుమారుడు కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అని వ్యాఖ్యానించారు.

బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ద‌గ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “మా ఇంకొల్లు వచ్చాను… మా ప్రజలకు నా మనసులో మాట చెప్పాలి. కొన్ని రాజకీయ విషయాలు మాట్లాడతాను.

ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేం ఇమడలేమని నిర్ణయించుకున్నాం. లేచిన దగ్గర నుంచి నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు నేను మనసు చంపుకొని చేయలేను. అవసరమైతే, ప్రజాసేవ చేయాల నుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా నాకు అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తా“ అని అన్నారు.

గతానికి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పోలికలేదన్న ద‌గ్గుబాటి… ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవని అన్నారు. ఆయన సంక్షిప్త ప్రసంగం విన్న మండల స్థాయి నాయకులు, దగ్గుబాటి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

ఇదిలావుంటే, కొన్నాళ్ల కింద‌ట అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ద‌గ్గుబాటిని తోడ‌ల్లుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల టికెట్‌ను ద‌గ్గుబాటి కుమారుడు చెంచురామ్‌కు ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి స‌తీమ‌ణి, అన్న‌గారి కుమార్తె పురంధేశ్వ‌రి.. బీజేపీ కేంద్ర నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.