వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిరంతరం తనను గెలిపించిన పార్టీకి షాకులు ఇస్తూనే ఉన్నారు. ‘బొచ్చులో నాయకత్వం‘ అన్న మాటతో మొదలైన ఇసుక వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండానే పదవి నుంచి డిస్మిస్ చేయాలంటూ లోక్ సభ స్పీకరుకు వైసీపీ పార్లమెంటరీ విభాగం వినతిపత్రం ఇచ్చింది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సస్పెండ్ చేస్తే అతనికి మేలు చేసినట్టు అవుతుందన్న ఏకైక కారణంతో సస్పెండ్ చేయడం లేదు. దీంతో ఆయన ఏం చేసినా వార్తే అవుతోంది. అలా అని రఘురామ రాజు ఏది పడితే అది చేయడం లేదు. తన భవిష్యత్తు ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. తాజాగా అయోధ్య రామాలయానికి భారీ విరాళం ఇచ్చారు.
ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం దేశంలోని 10 కోట్ల కుటుంబాలని సంప్రదిస్తామని రామాలయ ట్రస్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో రఘురామరాజు తన మూడు నెలల జీతభత్యాలను Rs 3,96,000 (మూడు లక్షల తొంబై ఆరు వేలు రూపాయలు) ఆలయ నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. రామాలయ నిర్మాణానికి నా వంతు ఉడతాభక్తిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ఈ విరాళం సమర్పిస్తున్నట్టు ఆయన తన ప్రకటన విడుదల చేశారు. ప్రకటనతో పాటు చెక్ ఫొటోను కూడా తన సోషల్ మీడియాలో పెట్టారు.
మొదట విమర్శలు, ఆ తర్వాత లేఖలతో ముఖ్యమంత్రి జగన్ ను ఇరిటేట్ చేసిన రఘురామ రాజు ఇటీవల మోడీని కీర్తిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోడీ శంకుస్థాపన నేపథ్యంలో ఈ విరాళం ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. నిబంధనల ప్రకారం అనర్హతకు తగిన తప్పులు రఘరామరాజు చేయలేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో సస్పెండ్ చేస్తే గాని వైసీపీకి ఈయన బాధ తప్పేలా లేదు. కానీ రాజు గారు మాత్రం యథా ప్రకారం పార్టీకి విధేయత చూపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates