కేసీఆర్‌కు ఏపీ ప్ర‌భుత్వం బిగ్ షాక్

రాజ‌కీయాల్లో ఏ ప‌రిస్థితిని అయినా..త‌న‌కు అన‌కూలంగా మార్చుకుని.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విరుచుకుప‌డే బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విభ‌జ‌న అంశాల‌పై, ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థ‌ల విష‌యంపై దాదాపు 8 సంవ‌త్స‌రాలుగా ఉలుకు.. ప‌లుకు లేకుండా.. తెలంగాణ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌ను న్యాయ‌స్థానానికి లాగేసింది.

అది కూడా..ఈ ఏడాది తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలోను.. మ‌రోవైపు ఏపీలో అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధ‌మైన స‌మ‌యంలోను వైసీపీ ప్ర‌భుత్వం విభ‌జ‌న అంశాల అస్త్రాన్ని తెర‌మీదికి తీసుకువ‌చ్చి.. సుప్రీం గ‌డ‌ప తొక్క‌డం.. రాజ‌కీయంగా కేసీఆర్‌కు పెను ఇబ్బందులు సృష్టించే అవ‌కాశం ఉంది. ఎటు వైపు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించినా.. జాతీయ‌నేత‌గా.. ఆయ‌న‌కు ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

ఒక‌టి: విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా చూస్తే.. ఏపీ, తెలంగాణ‌కు సంబంధించిన ఆస్తుల‌ను జ‌నాభా ప్రాతిప‌దిక‌న పంచుకోవాల్సి ఉంది. దీనికి తెలంగాణ స‌ర్కారు మ‌రో వాద‌న తెర‌మీదికి తెచ్చింది. ఎక్క‌డి ఆస్తులు అక్క‌డే అని చెబుతోంది. ఇక‌, ఇప్పుడు సుప్రీం గ‌డ‌ప తొక్కిన నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. ఆయ‌న ఇప్పుడు జాతీయ పార్టీ నాయ‌కుడు కూడా కావ‌డంతో కేవ‌లం తెలంగాణ వాదాన్ని వినిపిస్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వు.

అలాగ‌ని.. చ‌ట్టం ప్రకారం చేయ‌మంటే.. ఏపీకి మెజారిటీ ఆస్తులు ద‌క్కుతాయి. ఇది తెలంగాణ సెంటిమెంటుకు, నిధులు, నీళ్లు, నియామ‌కాలు అన్న కీల‌క నినాదానికి .. కేసీఆర్ తెర‌దించేసిన‌ట్టు అవుతుంది. అలా కాకుండా.. ఏపీకి ఆ ఆస్తులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వాదిస్తే..ఏపీలో ఏ మొహం పెట్టుకుని.. అడుగు పెడ‌తారు? అనేది మ‌రో కీల‌క ప్ర‌శ్న‌. ఏపీకి ఇప్ప‌టికే అన్యాయం చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి స‌య‌మంలో విభ‌జన షెడ్యూల్‌లోని 9,10 అంశాల్లోనూ అన్యాయం చేస్తే..ఏపీ ప్ర‌జ‌లు రగిలిపోవ‌డం ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌కు ఈ కేసు రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.