ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో నేతలు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఈరోజు మరోసారి టీడీపీ కీలక నాయకుడు, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆవెంటనే మాచర్లలో 114 సెక్షన్ను రాత్రికి రాత్రి ప్రకటించారు. అదేసమయంలో సెక్షన్ 30 ని కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ నేలను అప్రకటిత గృహనిర్బంధం చేసినట్టు అయింది. అయినప్పటికీ, బ్రహ్మానందరెడ్డి తన పర్యటన సాగిస్తానని.. చెప్పడం గమనార్హం.
మరోవైపు.. పోలీసులు మాచర్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఈ పరిణామాలతో మాచర్లలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates