తెలంగాణలో రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ.. రాజకీ య వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ తనదైన శైలిని ఎంచుకుని.. తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా.. ‘సరళ్’ యాప్‌ను తెలంగాణ బీజేపీ ప్రవేశ పెట్టనుంది.
ఏంటీ యాప్?
ఈ యాప్ విషయానికి వస్తే.. S- సంఘటన్, R- రిపోర్టింగ్, A- అనాలసిస్ L- లీడ్(SARAL)’గా బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ‘సంఘటన్ మహా విస్తార్’ అభియాన్‌లో భాగంగా పార్టీ విధానాలు, కార్యక్రమాలను కార్యకర్తలందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించారు.
రాష్ట్రంలో మొత్తం 6,973 శక్తి కేంద్రాలు, 34,867 బూత్‌లు ఉన్నాయి. సరళ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇప్పటికే ఎంపిక చేసిన కార్యకర్తలకు క్యూఆర్ కోడ్ పంపించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా 6359119119 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న బూత్‌లు, శక్తి కేంద్రాలు, జిల్లాలు, మండలాలు, విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మొతాన్ని పొందుపరిచారు.
ఇది సోషల్ మీడియాకు కూడా అనుసంధానమై ఉంటుంది. అధిష్ఠానం నిర్వహించబోయే కార్యక్రమాలు, దేశంలో పార్టీ ప్రముఖుల రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇప్పటికే గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సరళ్ యాప్‌ను వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించామని పార్టీ నేతలు చెబుతున్నారు.