తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించాలని నిర్ణయించుకుని.. అక్కడకు చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రభుత్వం అన్ని వైపుల నుంచి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. దీనిలో భాగంగా.. చంద్రబాబు ప్రజల మద్యకు వెళ్లేందుకు వీలు లేకుండా.. చైతన్య రథాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మూడు రోజులైనా టీడీపీ నేతలకు అప్పగించలేదు.
దీంతో కుప్పం రాజకీయం ఇప్పుడు చైతన్య రథం చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. తమ వాహనాన్ని తిరిగి ఇవ్వాలని పోలీసులకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినా.. ఇప్పటి వరకు పోలీసులు రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. అసలు చైతన్య రథం ఎక్కడుందో కూడా చెప్పడం లేదు. మాదగ్గర లేదంటే మాదగ్గర లేదంటూ.. కుప్పం పోలీసులు.. టీడీపీ నేతలకు చెబుతుండడం కొసమెరుపు.
చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే..తొలి రెండు రోజులు పోలీసుల రగడతో గడిచిపోయాయి. కనీసం మూడో రోజు శుక్రవారమైనా.. ప్రజల మధ్యకువెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ, మూడో రోజు మరింత ఉత్కంఠ రేపుతోంది. పర్యటనకు నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ప్రజల మధ్యకు వెళ్లేందుకు అధినేత సిద్ధమవుతుండటంతో.. ఆయన ప్రయాణించే చైతన్య రథాన్నిపోలీసులు కనిపించకుండా చేశారు.
కుప్పం గుడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి చంద్రబాబు చైతన్య రథాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. చంద్రబాబు పోలీస్ స్టేషన్‌కు వస్తారనే సమాచారంతో రాత్రికి రాత్రి చైతన్య రథం తరలించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సౌండ్ వాహనాన్ని పోలీసు స్టేషన్లోనే ఉంచి అది ఎవరికీ కనిపించకుండా భారీ వాహనాలను అడ్డుగా ఉంచారు. దీంతో చైతన్య రథాన్ని అప్పగించాలంటూ తెలుగుదేశం నేతలు నిరసనలకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. దిగజారిన రాజకీయానికి చరిత్రలో జగన్ ఒక పర్యాయపదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఆడబిడ్డలపై హత్యాయత్నం కేసులు జగన్ అభద్రతకు చిహ్నమన్నారు. మహిళలు తమను చంపడానికి వచ్చారని పోలీసులు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసులు పెట్టిన అధికారుల దిగజారుడుతనాన్ని సమాజం అసహ్యించుకుంటోందని మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates