అంత టెన్ష‌న్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ అంత్యాక్ష‌రి

దేశ‌మంతా క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోయి ఉంటే.. రాజ‌స్థాన్‌లో మాత్రం రాజ‌కీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ స‌ర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం.. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.

స‌చిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. ఇటీవ‌ల మీడియా ముందు 104 మందితో ప‌రేడ్ నిర్వ‌హించి త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైల‌ట్‌ను ఉప ముఖ్య‌మంత్రిగా తొల‌గిస్తూ నిర్ణ‌యం కూడా తీసుకున్నాడాయ‌న‌.

https://www.youtube.com/watch?v=qHVI0X9nk-s

ఆ ప‌రేడ్ తర్వాత గెహ్లాత్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రినీ ‌శిబిరానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లంద‌రికీ బ‌స క‌ల్పించి.. స‌క‌ల వ‌స‌తులూ క‌ల్పించిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌ల‌ప‌కుండా వారిఫోన్ క‌నెక్ష‌న్లు కూడా క‌ట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బ‌స చేసిన హోట‌ల్ నుంచి తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఓ వీడియో ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అవుతోంది.

బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్ష‌రి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాల‌పై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పాట‌లు పాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ‌కీయంగా రాజ‌స్థాన్‌లో అంత ఉత్కంఠ‌భ‌రిత వాతావ‌ర‌ణ నెల‌కొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్ష‌రి పాడుకుంటున్నారేంటా అని జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారీ వీడియో చూసి.