తోట‌, రావెల‌.. వీరి ప్ర‌భావం ఎంత‌?

ఏపీలో రాజ‌కీయ సంచ‌ల‌నం అని కొంద‌రు అంటున్నా.. అంత‌టి రేంజ్ అయితే.. కాక‌పోయినా.. కొంద‌రు మాత్రం వెళ్లి భార‌త రాష్ట్ర స‌మితి.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవ‌డం మాత్రం స‌హ‌జంగానే రాజ‌కీయాల‌ను వేడెక్కించింది. తోట చంద్ర‌శేఖ‌ర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబులు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ స‌మ‌క్షం లో బీఆర్ఎస్ గూటికి చేరుకున్న ద‌రిమిలా..ఏపీలో ఏదో జ‌రిగిపోతుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

అయితే.. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన తోట చంద్రశేఖ‌ర్ కానీ, పార్టీలో చేరిన రావెల కిశోర్ బాబుల విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? వీరి ప్ర‌భావం ఎంత‌? ఏపీలో వీరు ఏ మేర‌కు పార్టీని పుంజుకునేలా చేస్తారు? అసలు.. వీరి ముఖాలు.. ఎంత మందికి తెలుసు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇద్ద‌రూ కూడా ఆయారాం.. గ‌యారాం బ్యాచ్ నాయ‌కులుగానే పేరు తెచ్చుకున్నారు.

పైగా.. స్థిర‌మైన రాజ‌కీయాలు చేసింది కూడా లేద‌నే టాక్ ఉంది. ఇద్ద‌రూ కూడా.. పెద్ద వాయిస్ ఉన్న నాయకులు కానీ, ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత‌లు కానీ.. కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇద్ద‌రి విష‌యం పై ఎలాంటి స్పంద‌నా రావ‌డం లేదు. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌జారాజ్యం నుంచి వైసీపీ వ‌ర‌కు.. అక్క‌డ నుంచి జ‌న‌సేన వ‌ర‌కు.. అనేక పార్టీలు మారారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న గుంటూరు, ఏలూరుల నుంచి కూడా పోటీ చేశారు. అయినా..ఒక్క‌చోట కూడా విజయం ద‌క్కించుకోలేక పోయారు. అంతేకాదు.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందినప్ప‌టికీ.. తోటకు ప్ర‌జాద‌ర‌ణ లేద‌నేది వాస్త‌వం. ఇక‌, రావెల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న కూడా అన్ని పార్టీల‌నూ ట‌చ్ చేశారు. ఒక్క వైసీపీ మిన‌హా.. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల్లో చేర‌డం.. రావ‌డం.. వంటివి అయిపోయాయి. ఎస్సీ సామాజిక‌వర్గానికి చెందిన రావెల ప్ర‌జ‌ల‌పై చూపించే ప్ర‌భావం పెద్ద‌గా లేదు.

పైగా రావెల కుమారుడిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు.. వివాదాల‌కు అవ‌కాశం ఇచ్చారు. సో.. ఎలా చూసుకున్నా.. ఇద్ద‌రి ఎంపిక‌ను ప‌రిశీలిస్తే.. ఏపీలో బీఆర్ఎస్ ఎలా ముందుకు న‌డుస్తుంద‌నే విష‌యం స్ఫ‌ష్టం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.