ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక పక్క పొత్తుల కసరత్తు చేస్తూనే మరో పక్క సొంత బలాన్ని అంచనా వేసుకుంటోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలను ఢిల్లీ పిలిపించుకుంటూ, సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు రూటు మార్చిందని చెబుతున్నారు…
జనవరి 8న రాక
కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఏపీ పర్యటనకు వస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఏపీపై దండయాత్ర చేయబోతున్నారు. జనవరి 8న ఏపీలో అమిత్ షా పర్యటన ఉంటుందని బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఏపీలో అమిత్ షా పర్యటిస్తారు. కర్నూలు, హిందూపురం లోక్ సభా నియోజకవర్గాల పరధిలో అమిత్ షా టూర్ ఉంటుంది. సమర యోధుల కుటుంబాలను అమిత్ షా కలుస్తారని చెబుతున్నారు… అంటే రాయలసీమపై బీజేపీ ఫోకస్ పెట్టిందని అనుకోవాలేమో…
జగన్ పాలనే టార్గెట్
ఏపీ పర్యటనలో భాగంగా జగన్ పాలనను అమిత్ షా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జగన్ తప్పిదాలను ఎండగట్టడంతో పాటు జనంలో పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు అమిత్ షా వస్తున్నారని భావించాల్సి ఉంటుంది. నిజానికి బీజేపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి వైసీపీని సమర్థిస్తే, మరోకటి టీడీపీకి మద్దతిస్తుంది. ఆ గ్రూపులను ఇప్పుడు ఆయా పార్టీలకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
అమిత్ షా పర్యటన సందర్భంగా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో అమరావతి రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. రైతులకు జరిగిన అన్యాయంపై ఏం చెబుతారో…. జగన్ పై పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాసటగా నిలుస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates