చిన్నమ్మపై కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు

karthi

కొన్నిసార్లు రాజకీయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ పార్టీ సంగతిని చూసుకోని కొందరు నేతలు.. తమకేమాత్రం సంబంధం లేని అంశాల్లో తలదూర్చటమే కాదు.. సదరు పార్టీ నేతలకు కాలిపోయేలా వ్యాఖ్యలు చేస్తుంటారు.

తాజాగా అలాంటి వ్యాఖ్యల్నే చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చిదంబరం కుమారుడు కమ్ పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం. తాజాగా బెంగళూరు నుంచి కారులో తమిళనాడులోని చెన్నైకి వచ్చిన ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ.. త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని.. అప్పటి నుంచి అధికార అన్నాడీఎంకే ఆమె చేతుల్లోకి వెళుతుందని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శశికళ.. అన్నాడీఎంకేపార్టీ పూర్తి అధికారాల్ని చేపడుతుందని.. దినకరన్ మరోసారి అన్నాడీఎంకేలో కలిసిపోతారన్నారు.

అన్నాడీఎంకేలో కలకలం రేపేలా కార్తీ చిదంబరం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళను అన్నాడీఎంకేలోకి రానిచ్చే పరిస్థితి లేదు. అలాంటివేళ.. చిన్నమ్మ పేరును ప్రస్తావించటం ద్వారా ఆయన కొత్త రాజకీయానికి తెర తీశారనే చెప్పాలి.

మరికొద్ది నెలల్లో శశికళ పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్న వేళ.. అధికార అన్నాడీఎంకేలో కొత్త కలకలానికి బీజం వేసేలా కార్తీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. మరి.. దీనిపై అధికార అన్నాడీఎంకే ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.