టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మూడు రోజుల పాటు విజయనగరంలో విస్తృతంగా పర్యటించారు. సామాన్యుల నుంచి రైతుల వరకు కూడా ఆయన వారి గోడు విన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి.. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విన్నవించారు. కట్‌చేస్తే.. ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి మాత్రం యథాతథంగానే ఉండిపోయింది.
నాయకుల మధ్య సఖ్యత లేదు. అశోక్ గజపతి రాజు దూకుడు ఎక్కువగా ఉందని చాలా మంది నాయకులు పార్టీకి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో వైసీపీ తరఫున గెలిచిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు.. టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో అదే పార్టీతరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు మాత్రం.. ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు.
చంద్రబాబు వచ్చారు కాబట్టి.. ఆయన కూడా వచ్చి.. ఏదో మమ అనిపించారు. ఇక, నెల్లిమర్ల, విజయనగరం, ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మంత్రి బొత్స సత్యానారాయణ దూకుడుతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. చంద్రబాబు రాకతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు అనుకున్నారు. కానీ, చంద్రబాబు వీటిపై దృష్టి పెట్టలేదు.
కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు.. ఆయన స్వోత్కర్షలకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో విజయనగరం వంటి కంచుకోటలో పరిస్థితి యథాతథంగానే ఉందని అంటున్నారు పరిశీలకలు. తమ్ముళ్లు కూడా చంద్రబాబు వచ్చారు వెళ్లారు! అని పెదవి విరుస్తున్నారు. మొత్తం పర్యటన అంతా కూడా అశోక్ చేతుల మీదుగానే జరగడం మరింతగా అగ్గి రాజేసింది. మరి ఇక్కడ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates