ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతుంటారు. తాను సీఎం కావాలా… వద్దా అన్నది జనమే నిర్ణయిస్తారని స్టేట్ మెంట్ ఇస్తారు. రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలైనా జనసైనికులు చప్పట్లు, కేరింతలకు తక్కువేమి ఉండదు. పవన్ రాజకీయాలకు సినీ గ్లామర్ తోడు కావడంతో మీటింగులకు జన సందోహం బాగానే వస్తారు. ప్రతీ మాటకు ప్రజా స్పందన తక్కువేమీ ఉండదు.
ఇక బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇవ్వలేదని కొంతకాలం క్రితం జనసేనాని అలిగారు. మోదీ వచ్చి మాట్లాడిన తర్వాత ఆ విషయంలో సైలెంట్ అయిపోయినా మిగతా మాటలు కొనసాగిస్తున్నారు. బీజేపీతో స్నేహంగా ఉంటున్నారో లేదో మాత్రం అర్థం కావడం లేదు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మోదీ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సమన్వయ కమిటీకి దూరం..
బీజేపీకి దగ్గరగా ఉండాలా. ప్రస్తుతానికి దూరం జరగాలా అన్న సంగతి మాత్రం జనసేనకు అర్థం కావడం లేదని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో మోదీ న్యాయం చేస్తారని ధైర్యంగా ఉండలేకపోతున్నారుట. బీజేపీ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ సానుకూలంగా స్పందించలేకపోతున్నారట. చాలా రోజుల తరువాత బీజేపీ , జనసేన నేతల మధ్య ఆదివారం మరో భేటీ జరగబోతుందని వచ్చిన వార్తలు నిజం కాదని స్వయంగా ఆ పార్టీ తేల్చేసింది. మాజీ ప్రధాని వాజ్ పేయ్ జన్మదినం సందర్బంగా విజయవాడలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే సుపరిపాలన అంశం పై సమావేశం అనంతరం ఇరుపక్షాల నేతలు భేటీ కాబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. బీజేపీ నేతలే దీనిపై లీకులు ఇచ్చారు.
బీజేపీ ప్రస్తావనలను జనసేన కొట్టిపారేసింది. సమన్వయ కమిటీ సమావేశమేదీ జరగడం లేదని తేల్చేసింది. బీజేపీ సుపరిపాలనపై నిర్వహించే సభకు ఇద్దరు ప్రతినిధులను పంపుతున్నామని, అందులో రాజకీయాలు, పొత్తుల ప్రస్తావనేదీ ఉండదని జనసేన తేల్చేసింది. కమిటీలు, మీటింగులకు తొందరేమీ లేదని జనసేన అంటోంది. దానితో ఇప్పుడే బీజేపీతో అంటకాగేందుకు జనసేన భయపడుతోందని తాజా ఘటనలు చెబుతున్నాయి…
Gulte Telugu Telugu Political and Movie News Updates