టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని, ప్రస్తుత జగన్ హయాం అన్నదాతలకు నరక కూపమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని అన్నారు.
టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని, ఇప్పుడు దానిని వైసీపీ నేతలు నరక కూపంగా మార్చారని చెప్పారు. రైతులు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నా మన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
సింగిల్ విండో విధానం ద్వారా రైతులకు కావాల్సింది ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదలకు రూ.1,550 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రైతులపై వాలంటీర్లు పెత్తనం చేస్తారా? అని నిలదీశారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? అని విమర్శించారు.
పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. టీడీపీ అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. పాత వ్యవస్థలను ఎప్పుడూ రద్దు చేయలేదని పేర్కొన్నారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామని తెలిపారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates