కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల ప్రచార హడావుడి చూసి జనాలు ఇప్పటికే విస్తుబోతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈ మధ్య కరోనా కోసం విరాళాలిచ్చిన వాళ్ల నిలువెత్తు ఫొటోలు ట్రాక్టర్లలో పెట్టి ఊరేగిస్తూ చేసిన హంగామా ఎలాంటిదో అందరూ చూశారు.
మరోవైపు ఎమ్మెల్యే రజని తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటూ రిలీజ్ చేస్తున్న వీడియోలు ఎలా నవ్వుల పాలవుతున్నాయో తెలిసిందే. ఇప్పుడు వీటిని మించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అది వైకాపా మౌత్ పీస్, నగరి ఎమ్మెల్యే రోజాది కావడం విశేషం. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. నేషనల్ లెవెల్ జర్నలిస్టులు ఆమె వీడియోను షేర్ చేసి కామెడీ చేస్తున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందయ్యా అంటే.. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కొత్తగా నిర్మించిన బోర్వెల్ను ఆవిష్కరించడానికి రోజా వెళ్లింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆమె నడిచి వెళ్తుండగా.. రోడ్డుకు ఇరువైపులా జనం నిలబడి పూలు చల్లుతూ ఆమెను స్వాగతించారు. తనకు దండాలు పెడుతూ పూలు చల్లుతుంటే ఇదేంటని వారించకుండా రోజా వాటిని స్వాగతిస్తూ ముందుకు సాగింది.
తర్వాత మోటార్ ఆన్ చేసి బోర్ను ఆరంభించింది. ఈ సమయంలో జనం ఇలా గుమికూడటం ప్రమాదకరమని చెప్పాల్సిన ఎమ్మెల్యే.. గ్రామస్థులందరినీ పిలిపించి ఇలా బోర్వెల్ను ఆరంభించడమేంటి.. ఇలా పూలు చల్లించుకుంటూ స్వాగతాలు చెప్పించుకోవడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకుముందు చిత్తూరు జిల్లాలోనే ఓ వైకాపా ఎమ్మెల్యే చిన్న కల్వర్టు ఆరంభానికి వందమంది దాకా జనాన్ని పోగేసి కార్య్రక్రమం జరిపించడం విమర్శల పాలైంది. అయినా కూడా రోజా ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.