త‌న స్థ‌లంలో ఖ‌న‌నాలు చేసుకోమ‌న్న హీరో

క‌రోనా మ‌హ‌మ్మారి గురించి జ‌నం మ‌రీ భ‌య‌ప‌డిపోతుండ‌టానికి ఓ కార‌ణం.. ప‌రిస్థితి విష‌మించి ప్రాణాలు వ‌దిలితే ప‌ద్ధ‌తిగా అంత్య‌క్రియ‌లు కూడా జ‌రుపుకునే అవ‌కాశం లేక‌పోవ‌డం. కుటుంబ స‌భ్యులు కూడా మృత‌దేహాన్ని తాకే అవ‌కాశం ఉండ‌దు. స‌న్నిహితులు కూడా అంత్యక్రియ‌ల‌కు హాజ‌రు కాలేరు. ఆ స‌మ‌యంలో సాయం ప‌ట్ట‌డానికి కూడా మ‌నుషులు లేని దైన్యాన్ని చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల త‌మ ప్రాంతాల్లో క‌రోనా మృతుల్ని ఖ‌న‌నం చేయ‌డానికి కూడా జ‌నాలు అంగీక‌రించ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

త‌మిళనాడులో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. పరిస్థితి విషమించి ఆదివారం ఆయన మృతి చెందాడు. వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. స్థానికులు వ్య‌తిరేకించారు. ఈ ఉదంతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ ఉదంతంపై ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ స్పందించారు. క‌రోనా మృతుల్ని ఖ‌న‌నం చేయ‌డానికి త‌న కాలేజీలో స్థ‌లం ఇస్తాన‌ని ముందుకొచ్చారు. విజ‌య్‌కాంత్‌కు చెన్నై శివార‌ల్లో ఆండాళ్‌ అళగర్ పేరుతో ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. దీని ప్రాంగణంలోని కొంత భాగాన్ని క‌రోనా మృతుల ఖ‌న‌నానికి ఇస్తాన‌ని విజ‌య్ కాంత్ ప్ర‌క‌టించారు. రోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్‌ వ్యాపించెందదని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయ‌న కోరారు.

విజ‌య్ కాంత్ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఆయ‌న పెద్ద మ‌న‌సును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా గుర్తించాడు. ‘కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయడానికి స్థానికులు నిరాకరించారు. కానీ, డీఎండీకే నాయకుడు, సూపర్‌స్టార్ విజయ్‌కాంత్‌ తన కళాశాల భూమిలో కొంత భాగాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వడం నిజంగా అద్భుతమైన విషయం. ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం’ అని ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ పేర్కొన్నాడు.