ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించాలని భావిస్తున్న సీఎం జగన్.. దీనికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రచారం కల్పించేలా పదునైన అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా జనవరి నుంచి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ వంటివి తీసుకువచ్చిన సీఎం జగన్.. తాజాగా పార్టీ కోసం.. బూత్ స్థాయిలో మరింత వేగం పెంచనున్నారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ ఒక బూత్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కమిటీలోనూ ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా నాయకురాలు ఖచ్చితంగా ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. వీరంతా కూడా పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే.. మరోవైపు, ఇప్పటికే గృహ సారథులు అనే కాన్సెప్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ గృహ సారథుల్లో ప్రతి 50 ఇళ్ళకు ఇద్దరు చొప్పున ఉంటారు. వీరిలోనూ ఒక మహిళ ఉంటారు. మరొకరిని పురుషుడిని నియమిస్తారు. వీరు ఖచ్చితంగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రబుత్వ పథకాలను వివరించడంతోపాటు.. వైసీపీకి ఓటు వేయించే బాధ్యతను తీసుకుంటారు.
ఇలాప్రతి 50 ఇళ్లకు గృహసారథులు ఇద్దరు చొప్పున నిత్యం అందుబాటులో ఉంటారు. వచ్చే 16 మాసాలు వీరు సచివాలయంతోనూ.. ఇటు బూత్ కమిటీతోనూ సమన్వయం చేసుకుని.. ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. సో.. మొత్తంగా చూస్తే సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.