ఏపీ రాజధాని అమరావతి రైతులు మరో యాత్రకు రెడీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. ఇప్పటికే రెండు సార్లు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి(ఇది మధ్యలోనే ఆగింది) వరకు పాదయాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా తమ గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.
‘ధరణికోట నుంచి ఎర్రకోట’ వరకూ నినాదంతో నిరసన యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. దాదాపు 1800 మంది రైతులతో ప్రత్యేక రైలులో దేశ రాజధానికి వెళ్లనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.
అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసినా.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని రాజధాని రైతు నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరి షర్మిల అరెస్టుపై స్పందించిన ప్రధాని, స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రధాని మద్దతుతోనే వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఇదీ.. షెడ్యూల్
- 15వ తేదీ రాత్రికి విజయవాడ నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారు.
- డిసెంబర్ 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద అమరావతికి అనుకూలంగా నిరసన చేపట్టనున్నారు.
- డిసెంబరు 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతి గోడు వినిపించనున్నారు.
- 19వ తేదీన రాంలీల్ మైదానంలో జరిగే ‘కిసాన్ సంఘ్’ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొంటారు.
- 21వ తేదీన తిరిగి విజయవాడ చేరుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates