విడిపోయినా కలిసి ఉందామన్న తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన కీలక నినాదానికి కట్టుబడి ఉన్న వర్గం ఒకటి ఉంది. వారెవరూ రాజకీయ వేదికల మీద కనిపించరు. అలా అని పబ్లిక్ గా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ.. ఒకరికొకరు తమ అభిప్రాయాల్ని చాలా సూటిగా.. స్పష్టంగా చెప్పుకోవటానికి.. పంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి వారి సెక్షన్ కు తమ సొంత రాష్ట్రాల మీద అవసరమైనంత ప్రేమాభిమానాలు ఉంటాయే తప్పించి.. ఆ పేరుతో అనవసరమైన విన్యాసాలు చేసేందుకు ఇష్టపడరు.
విషయాన్ని విషయంగానే చూస్తారే తప్పించి.. అనవసరమైన మసాలాలు కలిపేందుకు ఇష్టపడరు. వ్యాపారాలు.. వ్యక్తిగత సంబంధాల్లోకి అనవసరమైన భావోద్వేగాల్ని తీసుకురాకుండా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవటానికి ఇష్టపడే బ్యాచ్ ఉంది. ఇలాంటి వారి మధ్య ఇటీవల జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ అమితంగా ఆకర్షించింది.
పాత్రికేయ ధర్మంలో భాగంగా ఆ వాదనను.. వారి వివరాల్ని బయటకు వెల్లడించకుండా.. పైన ప్రస్తావించిన సెక్షన్ వారి భావాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడీ విషయాల్ని వెల్లడిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతమైన.. రాజకీయ స్వార్థాలు ఏమీ లేవన్నది గుర్తిస్తే మంచిది. ఎందుకంటే.. అప్పుడు మాత్రమే విషయం మరింత సూటిగా.. స్పష్టంగా అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్రాధినేత తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం.. దానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావటం.. ఆ వెంటనే బెజవాడతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమివ్వటం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రాన్ని తాను నమ్మిన తెలంగాణ సిద్ధాంతంతో ముక్కలు చేసినప్పటికి.. ఆంధ్రాలోని కొందరికి కేసీఆర్ మీద ఉన్న ప్రేమాభిమానాల లెక్క తెలంగాణ వాదులకు అస్సలు అర్థం కాదు. తమకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ను ఆంధ్రోళ్లు అభిమానించటం వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి.. తెలంగాణ ప్రాంతీయులు సైతం సంతసించే పరిస్థితి.
అయితే.. టీఆర్ఎస్ కాదని బీఆర్ఎస్ పెట్టి..తన పరిధిని తెలంగాణ నుంచి భారతదేశం మొత్తమని తేల్చేసిన కేసీఆర్ ను మిగిలిన రాష్ట్రాల వారు అడిగినా.. అడగకున్నా.. ఏపీ ప్రజలు అనబడే ఆంధ్రోళ్లు కొన్ని ప్రశ్నలు అడగాలి కదా? తెలంగాణ ఉద్యమం వేళలో.. ఎవరైనా నేత నోటి నుంచి సమైక్యం గురించి మాట వస్తే వారికి సవాలచ్చ ప్రశ్నలు సంధించి.. న్యాయం చెప్పాలని ప్రశ్నించిన గొంతులతో పాటు.. తెలంగాణ ఉద్యమ వేళ హైదరాబాద్ కు కానీ.. తెలంగాణ ప్రాంతంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా.. జై తెలంగాణ అనే వరకు వదలని తెలంగాణ ప్రజల కమిట్ మెంట్ కు తగ్గట్లే ఆంధ్రోళ్లు తమ కమిట్ మెంట్ చూపించాలి కదా?
తాను నమ్మిన తెలంగాణను సాధించిన కేసీఆర్ కారణంగా ఏపీ ప్రాంత ప్రజలు ఎంతలా నష్టపోయారన్నది.. హైదరాబాద్ కు వచ్చే ప్రతి సందర్భంలోనూ.. కరోనా సమయంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సుల్ని ఆపేసిన వేళ.. చిన్న తేడా వచ్చినా నీ రాష్ట్రానికి నువ్వు పో.. ఇక్కడెందుకు? అంటూ ఏళ్లకు ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి ప్రశ్నలు ఎదురైన విషయాన్ని గుర్తు పెట్టుకున్నా..బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ను కొన్ని ప్రశ్నలు ఆంధ్రోళ్లు న్యాయంగా అడగాలి కదా? ధర్మంగా ప్రశ్నించాలి కదా?
జాతీయ పార్టీ పెడుతున్నావు సరే? విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా మాటేంటి? పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏమిటి? రాజధాని విషయంలో బీఆర్ఎస్ అభిప్రాయం ఏమిటి? రాజధాని నగరానికి అవసరమైన నిధులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రతిపాదన ఏమిటి? విభజన తర్వాత ఏపీ ఎంతలా ఆగమైందన్న విషయాన్ని కేసీఆర్ పెద్ద మనసుతో ఒప్పుకొని.. అమరావతి శంకుస్థాపన రోజున.. ఒక ధనిక రాష్ట్రాధినేతగా అంతో ఇంతో సాయం ప్రకటించాలని అనుకోవటం.. దేశ ప్రధాని చెంబుడు మట్టి.. మరో చెంబుడు నీళ్లు ఇచ్చి పోతున్న వేళ.. తాను ఎక్కువ చేస్తూ సాయం ప్రకటిస్తే పెద్దాయనకు కోపం వస్తుందన్న ఉద్దేశంతో మూసుకొని వచ్చేసినట్లుగా చెప్పిన కేసీఆర్.. బీఆర్ఎస్ ఎజెండాలో ఏపీకి విభజన కారణంగా జరిగిన నష్టాన్ని ఎలా పూరిస్తారు? దానికి ఆయన వద్ద ఉన్న వాదన ఏమిటి? లాంటి ఎన్నో ప్రశ్నల్ని అడగాలి కదా?
ఒకవేళ.. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్న ఉద్దేశం కేసీఆర్ కు లేకపోవచ్చు. కానీ.. బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి.. దాని ఫ్లెక్సీలు బెజవాడతో సహా బోలెడన్ని చోట్ల పెట్టేసిన ఆంధ్రోళ్ల బుర్రలకు తమ హక్కుల మాటేమిటి? దానికి కేసీఆర్ మాటేమిటి? అని ప్రశ్నించాలన్న సోయి ఉండాలి కదా? ఓట్లు అడగటానికి సిద్ధమైన గులాబీ బాస్ ను.. వచ్చుడు సరే.. తెచ్చుడు మాటేమిటి? అని ప్రశ్నల్ని అడగాలి కదా? కూసింత తేడా వస్తే చాలు.. ఆంధ్రోళ్లు.. ఏపీ వాళ్లు అంటూ నోరు పారేసుకునే గులాబీ పార్టీకి.. చివరకు అత్యంత విశ్వసనీయ ఓటు బ్యాంకుగా తెలంగాణలో మిగిలింది ఎవరైనా ఉన్నారంటే అది సెటిలర్లు మాత్రమే.
ఆ విషయం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లోనూ స్పష్టమైంది. మరి.. ఇంత జరిగిన తర్వాత కూడా సెటిలర్లు.. సీమాంధ్రులను కూరలో కరివేపాకులా వాడేయటమే తప్పించి వారికి ఇవ్వాల్సిన మర్యాదల్ని ఇవ్వలేదన్న వాస్తవాన్ని మర్చిపోలేం. అదే సమయంలో.. తెలంగాణలో సీమాంధ్ర మూలాలు ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలు.. తెలంగాణవాదాన్ని పఠించే గులాబీ బ్యాచ్ కు.. ఏపీకి ఏ ముఖం పెట్టుకొని వెళ్లి ఓట్లు అడుగుదామన్నది లేకపోవటం ఒక ఎత్తు అయితే.. తమ ఇలాకాకు వచ్చేందుకు ఆత్రుత పడుతున్న గులాబీ బాస్ ను అడగాల్సిన ప్రశ్నల్ని ఆంధ్రోళ్లు ఎందుకు అడగరు? ఎందుకు నోరు విప్పరు? తమకు మించిన తోపు మేధావులు లేరని గొప్పగా ఫీలయ్యే ఆంధ్రోళ్లు.. అందుకు తగ్గట్లుగా చేతల్లో చూపరెందుకు? ఇదంతా చెబుతూ.. ఆంధ్రోళ్లకు బుద్ది.. బుర్రా ఉండదా బాస్? అని ఎవరైనా ప్రైవేటు చర్చల్లో మాట అనేస్తున్నప్పుడు మూసుకొని ఉండటం తప్పించి.. సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆంధ్రోళ్లు కాదనగలరా?