బీఆర్ ఎస్‌-వైసీపీ క‌లిసి పోటీ చేస్తున్నాయా?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలైనా తెర‌మీదికి రావొచ్చు. అవ‌స‌రం-అవ‌కాశం-అధికారం.. అనే కీల‌క ప‌రిణామాలు…. రాజ‌కీయాల‌ను, నాయ‌కుల‌ను ఎటువైపైనా మ‌లుపు తిప్ప‌వ‌చ్చు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల్లోనూ అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కార్యాకార‌ణ సంబంధంగా.. అటు ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్‌గా మార్చేందుకు అనుమ‌తిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌చ్చ‌జెండా ఊపింది.

అదే రోజు.. ఇటు ఏపీలో వైసీపీ కీల‌క నాయ‌కుడు, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మైక్య రాష్ట్రంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెండు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచాల‌నేదే త‌మ కోరిక అని వ్యాఖ్యానించారు. అటు బీఆర్ ఎస్ పార్టీకి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం.. ఇటు స‌జ్జ‌ల హాట్ కామెంట్ చేయ‌డం రెండూ కూడా ఒకే రోజు ఒకే స‌మ‌యంలో జ‌ర‌గ‌డం వెనుక‌.. ఏదో ఆంత‌ర్యం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొంచెం లోతుగా వెళ్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ సెంటిమెంటును అవ‌స‌ర‌మైన మేర‌కు సీఎం కేసీఆర్ తీస్తూ నే ఉన్నారు. ఎన్నిక‌లున్నా.. త‌న‌కు ఎవ‌రైనా ఎదురుతిరిగినా.. వెంట‌నే ఆయ‌న‌ తెలంగాణ‌ కార్డు తీస్తున్నారు. సాధ్య‌మైన ప‌నిని త‌న ఖాతాలో వేసుకుంటూ.. తాను సాధించ‌లేని నిధులు, నీళ్ల విష‌యాల‌ను మాత్రం ఆయ‌న తెలివిగా.. తెలంగాణ సెంటిమెంటుతో కొట్టేస్తున్నారు.

అయితే, ఎన్నాళ్ల‌ని ప్ర‌జ‌లు ఇలా.. సెంటిమెంటు డైలాగులు వింటూ పొద్దు పుచ్చుతారు? ఇదే ఇప్పుడు కేసీఆర్‌కు కూడా తెలిసి వ‌చ్చిందని తెలుస్తోంది. అందుకే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా చ‌క్రం ఏపీ వైపు తిప్పి.. అటు నుంచి న‌రుక్కు వ‌స్తున్నార‌ని అంటున్నారు. అంటే.. స‌మైక్య‌పిలుపు ఇస్తే.. ఇటు మ‌రోసారి సెంటి మెంటును ర‌గిలించుకుని.. త‌న పీఠం క‌ద‌ల‌కుండా చేసుకునే వ్యూహం ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. ఏపీలో జ‌గ‌న్ కూడా ఈ సారి ఒంట‌రిగా పోటీ చేసే అవ‌కాశం లేద‌ని విశ్వ‌సిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆయన వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసుకునేందుకు బీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు. బాగా వ్య‌తిరేక‌త ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను బీఆర్ ఎస్‌కు ఇచ్చి.. తాను సైలెంట్‌గా ఉండ‌డం ద్వారా వ్య‌తిరేక ఓటు నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

ఇక‌, ఏమైనా తేడా కొడితే.. అది ఏపీలో బీఆర్ ఎస్‌కు, అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో అయితే ష‌ర్మిల పార్టీకి ప‌డేలా ప‌క్కా స్కెచ్ ఏదో ప‌న్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేక‌పోతే.. ఒకే రోజు అటు బీఆర్ ఎస్‌ను ప్ర‌క‌టించ‌డం.. ఇటు స‌మైక్య రాష్ట్రంపై వైసీపీ కామెంట్లు చేయ‌డం.. ఏంట‌ని? అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌తృత్వం ఉండ‌దు క‌నుక‌.. రేపు కేసీఆర్‌, జ‌గ‌న్ చేతులు క‌లిపినా క‌ల‌పొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.