ఏపీలో మరో ప్రతిపక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. వైసీపీ అవినీతి, అక్కమాలపై యుద్ధం చేస్తామని తరచుగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్టు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే, ఎందుకో ఇది వాయిదా పడింది. అయితే, తాజాగా.. ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
Pawan Kalyan చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఎన్నికల యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమైంది. ఈ వాహనం తాలూకు వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. ఈ వాహనాం ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు
కాగా, ఈ వాహనానికి వారాహి అనే అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. కాశీలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. నేరుగా ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకునే అవకాశం లేదు. చిన్నపాటి కిటికీల గుండా మాత్రమే భక్తులు చూసేందుకు అనుమతిస్తారు. అది కూడా ఉదయం 6-7 గంటల మధ్యలోనే!
ఎందుకీ వాహనం.. అంటే 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఏపీ వ్యాప్తంగా ఈ వాహనంలో పర్యటించనున్నారు. కాగా ఈ బస్సు .. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్‌కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్‌టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.