కోపం వచ్చినప్పుడు నాలుగు తిట్లు ఘాటుగా తిడితే అదోరకం. అందుకు భిన్నంగా కామెడీ చేస్తేనే ఇబ్బంది. అందునా.. ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీఎంకు నీడలా ఉండే విజయసాయిని ఉద్దేశించి చిన్న మాట అనేందుకు సైతం వణుకుతారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు మాత్రం మాటలతో గుచ్చేస్తున్నారు.
పార్టీ కట్టు తప్పారంటూ నరసాపురం ఎంపీకి పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వటం తెలిసిందే. నోటీసులోని పాయింట్లు తర్వాత.. అసలు నోటీసును అచ్చేసిన పేపర్ లోనే ఇష్యూ ఉందంటూ.. ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి తనకు పంపిన నోటీసును చదివితే తనకు ఈవీవీ సత్యనారాయణ సినిమా చూసినట్లుగా నవ్వుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ వేరు.. ప్రభుత్వం వేరన్న విషయాన్నివిజయసాయి గుర్తించలేదన్న ఆయన.. తాను లోక్ సభలో మాతృభాషపై మాట్లాడినందుకు పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తనను అభినందించారని.. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తాను ఆయన్ను కలిసి వివరించానని చెప్పారు.
తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న అంశాలేవీ పార్టీని వ్యతిరేకించేవి కాదన్న ఆయన.. తనకు కేంద్రమంత్రిపదవి ఖరారైందన్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు మోడీ సర్కారు మంత్రిపదవి ఇవ్వాలనుకుంటే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇవ్వొచ్చని వ్యాఖ్యానిస్తూ మరికాస్త కన్ఫ్యూజ్ కు గురి చేశారు. కేంద్ర బలగాలు తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకార్యదర్శిని కోరానని.. ఏపీ ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తానని చెప్పినందుకే కేంద్రం తనకు రక్షణ కల్పించలేదేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. విజయసాయి పంపిన షోకాజ్ నోటీస్ లోని అంశాలు చదివితే ఈవీవీ సినిమా చూసినట్లుగా ఉందంటూ కామెడీ చేసిన వైనం విజయసాయి అండ్ కో జీర్ణించుకోలేనిదిగా ఉందని చెబుతున్నారు.ఇంతలా ఆయన్ను సొంత పార్టీలో వ్యాఖ్యలు చేసినోళ్లు లేదన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates