గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగనుందా? తిరిగి అదికార పీఠంపై కమల వికాసం జరగనుందా? అంటే.. ఔననే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహకులు తాజాగా సోమవారం రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన గంటలోనే ఇక్కడ ఎవరు పాగా వేస్తున్నారనే విషయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఎగ్జిట్ పోల్ నిర్వహించిన మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. ప్రజలు ఆపార్టీవైపే నిలబడి నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రకారం 182 స్థానాలకు బీజేపీ 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్‌కు 30 నుంచి 48 స్థానాలు, ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. 3 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది.
‘ఔట్ ఆఫ్ ద బాక్స్’ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్ 25 నుంచి 35 సీట్లు, ఆప్ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.
‘ఆత్మసాక్షి’ సర్వే ప్రకారం బీజేపీకి 98 నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా.. కాంగ్రెస్‌కు 66 నుంచి 71 స్థానాలు, ఆప్‌కు 9 నుంచి 14 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.
‘న్యూస్ ఎక్స్ సర్వే’ ప్రకారం బీజేపీ.. 117 నుంచి 140 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. 34 నుంచి 51 చోట్ల, ఆప్ 6 నుంచి 13 చోట్ల పట్టు పెంచుకునే అవకాశం ఉంది.
రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం బీజేపీకి 128-148 సీట్లు, కాంగ్రెస్ 30-42 స్తానాలు, ఆప్ 2-10 సీట్లలో గెలుపు గుర్రం ఎక్కనున్నాయి.