ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు..కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారో…లేక పొరపాటున వారు చేసిన పనో, కామెంటో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో తెలియడం లేదు. ప్రజలపై, సమాజంపై ప్రభావం చూపగలిగిన హోదాల్లో ఉన్న సదరు వ్యక్తులు ఆచితూచి మాట్లాడాల్సింది పోయి…అడ్డగోలుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్లు ఈ కోవలోకే వస్తాయి.
హిందువులను ఉద్దేశించి అజ్మల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, అందుకే ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అజ్మల్ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, ముగ్గురు మహిళలతో హిందూ పురుషులు అఫైర్స్ పెట్టుకుంటారని, అందుకే, 40 ఏళ్ల వరకు బ్యాచ్ లర్స్ గానే ఉంటారని సదరు ఎంపీ చెప్పుకొచ్చారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్లే పిల్లలు పుట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందువులకు ఈ రోజుల్లో తక్కువ మంది పిల్లలు, సంతాన లేమికి ఇదే కారణమని కూడా బోధించారు ఈ ఎంపీ. సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితేనే మంచి ఫలితాలు వస్తాయంటూ మెట్ట వేదాంతం కూడా చెప్పారు. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవాలని, అపుడే ఎక్కువమంది పిల్లలు పుడతారని అన్నారు. ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన తక్షణమే పెళ్లి చేసుకుంటారని అన్నారు. పెళ్లి విషయంలో ముస్లింల విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని ఈ ఎంపీ సూచించారు.
దీంతో, ఈయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏమిటంటూ పలువురు బీజేపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.