ఏపీ బీజేపీలో జనసేన పార్టీ విషయంపై కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి ముందుకు సాగాలన్న రాష్ట్ర కమలనాథులు..ఎందుకు మథనపడుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీలక నాయకుడు హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్కడ నాయకులు అందరూ గుజరాత్ ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయన మాత్రం అర్జంట్ చర్చించాల్సిన విషయం ఉందని పేర్కొంటూ ఫ్లైటెక్కడం గమనార్హం.
ఇంతకీ ఏం జరుగుతోందంటే.. ఏపీలో జనసేన తమతో పొత్తులో ఉందని రాష్ట్ర కమలనాథులు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని, అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇదే విషయంలో పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆదిలో అంటే.. 2020-21 మధ్యకాలంలో మాత్రం కొంత వరకు బీజేపీని వెంటేసుకుని తిరిగారు.
తిరుపతి ఉప ఎన్నిక, బద్వేల్ ఉప పోరు తర్వాత ఆయన బీజేపీని పక్కన పెట్టేశారు. అలాగని కటీఫ్ చేసుకోలేదు. కేంద్ర నాయకత్వంతో మాత్రమే ఆయన టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే.. ఇలా ఉన్నప్పటికీ.. అటు విజయనగరంలో జరిగిన సభలో కానీ తాజాగా మంగళగిరిలో తూర్పు కాపులు, ఇప్పటం కూల్చివేతల బాధితులతో భేటీ అయినప్పుడు కానీ, పవన్ బీజేపీ గురించిన మాట కనీసం ప్రస్తావించలేదు.
పైగా.. నా యుద్ధం నేనే చేస్తానన్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు.. ‘బీజేపీ-జనసేన’ కూటమి ప్రభుత్వం వస్తుందని ఆయనచెప్పలేదు. కనీసం బీజేపీ గురించిన ప్రస్తావన అసలు తీసుకురానేలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులకు కలవరం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల వరకు పవన్ ఇలానే ఉండి..చివరి నిముషంలో ప్లేట్ ఫిరాయిస్తే.. ఏం చేయాలనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విషయాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు కీలక నేత ఒకరు ఢిల్లీకి వెళ్లారు. మరి అక్కడ ఏం చేస్తారో.. పవన్‌కు ఏం చెప్పిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates