ఆయనకు త్వరలో మంత్రి పదవి ?

Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు గుర్తింపు లభించే టైమ్ వచ్చింది. కీలకమైన వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలు ఆయనకు అప్పగించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త విజయసాయి రెడ్డికి ఆయన సహాయకుడిగా వ్యవహరిస్తారు.

చెవిరెడ్డి హార్డ్ కోర్ జగన్ అభిమాని, జగన్ కోసం చెవి కోసుకుంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చెవిరెడ్డిపై అనేక కేసులు పెట్టింది. నెలకోసారి అరెస్టు కూడా అయ్యేవారు. అంత జరిగినా చెవిరెడ్డి భయపడలేదు. పోరాటాన్ని కొనసాగించారు. జగన్ తోనే ఉన్నారు. అయినా ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ ఏడాది మొదట్లో జరిగిన పునర్ వ్యవస్థీకరణలో కూడా చెవిరెడ్డిని పక్కన పెట్టేశారు. తనకు మంత్రి పదవి వద్దని చెవిరెడ్డి స్వయంగా జగన్ దగ్గర విన్నవించుకున్నట్లు చెబుతారు..

అవసరమైతే జగన్ వెంట నీడలా ఉండే నేత చెవిరెడ్డి, జగన్ పార్టీ పెడుతున్నప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయనతో చేతులు కలిపిన బహుకొద్ది మందిలో చెవిరెడ్డి ఒకరు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ.. తుడా.. చైర్మన్ గా ప్రాంతీయ అభివృద్ధికి ఆయన బాగానే పనిచేశారని చెబుతారు. చంద్రగిరి, తిరుపతి ప్రాంతాల్లో ఆయనకు గట్టి కేడర్ బలముంది. అందరికీ సాయం చేస్తారన్న పేరు కూడా ఉంది.

చెవిరెడ్డికి వీరవిధేయుడుగా పేరుంది. జగన్ పట్లగానీ, పార్టీ పట్ల గానీ ఆయన ఎప్పుడూ అసహనాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఉంటే జగనన్నతో ఉంటా..లేకపోతే ఇంటి దగ్గర ఉంటానని ఆయన తేల్చేశారు.జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని కూడా చెవిరెడ్డి చెబుతున్నారట..

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అంకితభావంతో పనిచేసే నేతలకు సముచిత స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఇంకో పర్యాయం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జగన్ ప్రకటించి చాలా రోజులైంది. ఈ సారి పునర్ వ్యవస్థీకరణలో చెవిరెడ్డికి కీలక మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ఈ విషయమై కొందరితో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ముందస్తుగా అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఎవరికి ఉద్వాసన పలకాలనేది కూడా పెద్ద ప్రశ్న. అప్పుడు అందరూ రోజా వైపు చూడాల్సిందే…