స్వరాష్ట్రంలో వైద్యంపై పాలకులకే నమ్మకం లేదా?

కరోనా దెబ్బకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ విలవిలలాడుతున్నారు. పొలిటిషియన్లు, బిజినెస్ మెన్లు…నిలువ నీడ లేని వారు…నిరు పేదలు ఇలా…తన పర భేదం లేకుండా అందరినీ తన కర్కశ కౌగిలిలో బంధిస్తోంది కరోనా.

రాజకీయ నాయకుల నుంచి సాయం అందుకున్న ప్రజలు….ప్రజలకు సాయం చేసిన రాజకీయ నాయకులు…ఇలా ఏ కేటగిరీ వారినీ వదలడం లేదీ మహమ్మారి. అయితే, కరోనా సోకే విషయంలో తేడాలు లేనప్పటికీ….కరోనాకు చికిత్స అందించే…అందుకునే విషయంలో మాత్రం పేద, ధనిక తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎంపిక చేసిన సర్కారు దవాఖానలో కరోనా పేషెంట్లు కిక్కిరిసి పోవడంతో…ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు వీఐపీలు, పొలిటిషియన్లు. ఇక, కొంతమంది పొలిటిషియన్లయితే ఏకంగా స్వరాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులపై నమ్మకం లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలివెళుతున్నారు.

తాజాగా, కరోనా పాజిటివ్ అని తేలిన వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆయన భార్య,కుమార్తె కరోనా బారిన పడడంతో…మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరారని తెలుస్తోంది. పాలకులకే మన రాష్ట్రంలోని ఆసుపత్రులపై నమ్మకం లేకుంటే…ప్రజలకు ఎక్కడ నుంచి వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులను ఫాలో అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఏం చేసినా..ఆ ప్రభావం ప్రజలపై ఉంటుంది. అందుకే, చాలామంది ప్రజా ప్రతినిధులు….ప్రజలకు రోల్ మోడల్స్ గా ఉన్నారు. అటువంటి వారంతా తాము ఆచరించిందే ప్రజలకూ ఆచరించమని చెప్పేవారు.
అయితే, ప్రస్తుతం కొందురు ప్రజాప్రతినిధుల్లో ఆ లక్షణం కొరవడినట్లు కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తన కుటుంబంతోపాటు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం ఇందుకు నిదర్శనం. మొదట తిరుపతిలోని స్విమ్స్‌లో అంజాద్ బాషాకు చికిత్స అందించారు. ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పినా….మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ కు వెళ్లడం విశేషం.

ఇక, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య మరో అడుగు ముందుకు వేసి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇలా అవకాశం ఉంది కదా అని పాలకులు ఇతర రాష్ట్రాలకు పోతే అవకాశం…డబ్బులు లేని ప్రజలు ఎక్కడికెళ్లాలి? ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యంపై అధికార పార్టీకి చెందిన వారికే నమ్మకం లేకపోతే ప్రజలు ఎందుకు నమ్మాలి? అధికార పార్టీకి చెందిన నేతలే ఇలా పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారంటే….కరోనాకు వైద్యం సరిగా జరగడం లేదని వచ్చే ఆరోపణలను వారు బలపరిచినట్టే కదా?

ఇటువంటి ప్రశ్నలకు ఆ ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.0