ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఈ మధ్య అస్సలు టైం బాగాలేనట్లుంది. రెండు నెలల కిందట లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే అక్కడి గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో చోటు చేసుకున్న స్టెరీన్ గ్యాస్ లీక్ ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొనడమే కాక.. వందల మందిని అస్వస్థుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వైజాగ్లో ఒకట్రెండు చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సోమవారం రాత్రి విశాఖ నగరంలోని పరవాడ ఫార్మా సిటీలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
రాత్రి పదిన్నర ప్రాంతంలో అక్కడి రాంకీ ఫార్మా కంపెనీలో పెద్ద స్థాయిలో పేలుళ్లు జరిగాయి. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడి చుట్టు పక్కలప్రాంతాల్ని కమ్మేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని.. ఎవరి ప్రాణాలకూ ముప్పు వాటిల్లలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. గాయపడ్డ వారి ఫొటోలు కొన్ని ట్విట్టర్లో కనిపించాయి. వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో 80 దాకా ఫార్మా కంపెనీలు ఉన్నాయని సమాచారం. ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి వెళ్లడంలో ఇబ్బంది తలెత్తిందని.. మంటలు పక్క కంపెనీలకు వ్యాపిస్తాయేమో అని ఆందోళన నెలకొందని అంటున్నారు. కలెక్టర్ వినయ్ చంద్ అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.