ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనరల్‌గా ఎపుడూ ఏదీ అడగరు. తాను చేసేది చెప్పడమే గాని… ఎవరిని అయినా ఏదైనా అడగడం చాలా అరుదు. రెండే రెండు సందర్భాల్లో అతను ఇతరులను అడుగుతారు. ఒకటి తన తల్లి బసవతారకం స్మారకార్థం ఏర్పాటుచేసిన క్యాన్సర్ ఆస్పత్రికి ప్రభుత్వాలను, ఎన్నారైలను మద్దతు కోరుతారు. రెండోది హిందూపురం నియోజకవర్గం విషయం ఎపుడూ ఒక బాధ్యతాయుత ఎమ్మెల్యేగా నియోజకవర్గ సంక్షేమానికి ప్రభుత్వాలను అడుగుతారు. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఒకటి కాదు రెండు లేఖలు రాశారు.
జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇపుడు ఏపీలో అది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రాంతీయతలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలను చీల్చవద్దంటూ అసమ్మతి మొదలైంది. దీనికి విరుద్ధంగా సర్ ప్రైజింగ్ గా జగన్ కాదనలేని డిమాండ్ చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. జిల్లా ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి ఇంకో జిల్లా ఏర్పాటుచేస్తే దానికి జిల్లా కేంద్రాన్ని హిందూపురం పట్టణాన్నే చేయాలని, జిల్లా పేరు కూడా హిందూపురమనే పెట్టాలని బాలకృష్ణ లేఖలో కోరారు. వాస్తవానికి ఇది జగన్ ఆలోచనలకు దగ్గరగా ఉంది. జగన్ 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా చేయాలనుకుంటున్న నేపథ్యంలో బాలకృష్ణ కోరికను జగన్ అమలుపరిచే అవకాశం ఉంది.
మరో లేఖ వైద్య కళాశాల గురించి రాశారు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో.. ఆ కాలేజీని హిందూపురం పట్టణ సమీపంలో మలుగూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ లేఖలో జగన్ ను కోరారు. మలుగూరు హిందూపురం నుంచి బెంగుళూరు హైవేకి చేరుకునే రాష్ట్ర రహదారిలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏర్పాటుచేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates