జ‌గ‌న్‌-ప‌వ‌న్‌-మోడీ.. ముహూర్తం ఖ‌రారు?!

ఏపీ పొలిటిక‌ల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సీఎం జ‌గ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకోనున్నారు. రాజ‌కీయంగా క‌త్తులు నూరుకునే ఈ ఇద్ద‌రు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. ఇది అధికారిక కార్య‌క్ర‌మమే అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్‌కు ‘ప్ర‌త్యేక ఆహ్వానం’ అందిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్ర‌ధాని పాల్గొనే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని.. కేంద్రం నుంచి ప‌వ‌న్‌కు ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో విశాఖలో ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శుక్ర‌వారం ప్రధాని విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారని చర్చ జరుగుతోంది. దీంతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ పర్యటిస్తారు. ప్రధాని పర్యటిస్తున్న సమయంలోనే టిడ్కో ఇళ్ల… సోషల్ ఆడిట్ అంశంపై జనసేన ప్రకటన చేయనుండటం విశేషం.

ఇక‌, ప్ర‌ధాని పాల్గొనే కార్య‌క్ర‌మాల్లోనూ ప‌వ‌న్‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో తొలిసారి ప్ర‌ధాని మోడీ, సీఎం జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకునే అద్భుత ఘ‌ట్టం తెర‌మీద‌కు రానుంద‌ని తెలుస్తోంది. ఇక‌, సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం విశాఖకు వెళ్తారు. ప్రధాని విశాఖకు రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే కార్య‌క్ర‌మాల‌కు ప‌వ‌న్‌ను కూడా ఆహ్వానించ‌డం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.