పొలిటికల్ లీడర్లు టీవీ ఛానెళ్లలో, అందులోనూ ఇంగ్లిష్ ఛానెళ్లలో డిబేట్లకు వెళ్లాలన్నా.. మధ్యలో అభిప్రాయం చెప్పాలన్నా కొంచెం డొక్క శుద్ధి, భాషా నైపుణ్యం చూసుకుని రంగంలోకి దిగితే బెటర్. అదేమీ చూసుకోకుండా పిలిచారు కదా అని మనకు నచ్చినట్లు వాదించేద్దాం, ఒపీనియన్ చెప్పేద్దాం అనుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయం. ఇంగ్లిష్ రానపుడు నాకు వచ్చింది ఇదే అంటూ తెలుగులో మాట్లాడేస్తే దాన్ని అనువాదం చేసుకోవడానికి వాళ్ల పాట్లేవో వాళ్లు పడతారు. అలా కాకుండా వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ఏదేదో మాట్లాడేస్తే నవ్వుల పాలవక తప్పదు. గతంలో సీఎం రమేష్ లాంటి వాళ్లు ఇలాగే ఇంగ్లిష్ ఛానెళ్లలో బుక్ అయిపోయారు. ఇప్పుడు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. అదే ట్రాప్‌లో పడి సోషల్ మీడియాలో కామెడీ అయిపోతున్నారు.
జనసేనాని ఇటీవల ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు అక్కడికి వెళ్లడం.. హైవేలో తన కారు రూఫ్ టాప్ ఎక్కి అలాగే కూర్చుని ప్రయాణించడం.. సంబంధిత వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ఈ వీడియోలో పవన్‌ను చూసి ఆయన సినీ అభిమానులు ఎలివేషన్లు ఇచ్చుకుంటే.. కొందరేమో బాధ్యత లేకుండా ఇలా ప్రయాణం చేయడం ఏంటి అని విమర్శించారు. ఇండియా టుడే టీవీ ఛానెల్ ఇదే విషయమై తాజాగా చర్చ పెట్టింది. ఇందులో భాగంగా అమర్‌నాథ్‌ను లైన్లోకి తీసుకుని ఆయన అభిప్రాయం చెప్పమన్నాడు న్యూస్ ప్రెజెంటర్. దానికి సమాధానం ఇస్తూ అమర్‌నాథ్ ఏమన్నాడో ఒకసారి కింద చదవండి.
‘‘సీ డు నాట్ పొలిటికల్.. ఈజ్ దిస్ నాట్.. ఇట్స్ నాట్.. ఇట్స్ సినిమా.. సినిమాటిక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్.. ఇట్స్ ఎ రియల్ లైఫ్.. ఇట్స్ ఎ రియల్ లైఫ్ థింగ్.. ఇట్స్ నాట్ ఎ రీల్ లైఫ్ వన్.. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పర్సన్ హు ఈజ్ ఇన్ టు పాలి.. హు ఈజ్ ఇన్ టు సినిమా.. ఈజ్ ఎ సినిమాటిక్. హీ ఈజ్ ఎ సినిమా హీరో.. హు ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ రైట్ నౌ. అండ్ ఇస్ ఈజ్ పాలిటిక్స్ ఎ సినిమా.. యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సినిమా’’
చాలా కష్టపడి అమర్‌నాథ్ మాటల్ని అర్థం చేసుకుని దాన్ని స్క్రిప్టుగా రాస్తే ఇలా తయారైంది. దీన్ని చూసి ఆయనేం చెప్పదలుచుకున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వీడియోను చూపిస్తూ ఇతను మన ఐటీ మంత్రి.. ఓ పక్క తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రపంచ వేదికల మీద అద్భుతమైన ప్రసంగాలతో అదరగొడుతుంటే.. మన మంత్రి ఇలా తయారయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో పెట్టి వైవా హర్ష ‘‘ఆక్ ఈజ్ పాక్.. పాక్ ఈజ్ ఆక్.. సో ఆక్ పాక్ కరివేపాక్’’ డైలాగ్‌ను గుర్తు చేస్తూ అమర్‌నాథ్‌ను ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.