మునుగోడు చెబుతున్న ‘నిజం’ ఏంటి?

సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో సాగిన ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైనప్పటికీ టీఆర్ఎస్‌పై దీటుగానే పోరాడారనే అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి. ఎందుకంటే.. మెజారిటీ మరీ అంత ఎక్కువగా లేకపోవడం, రాజగోపాల్ రెడ్డికి పోలైన ఓట్ల సంఖ్యే ఇందుకు తార్కాణమని విశ్లేష‌కులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌ను, అధికారుల‌ను సైతం మోహ‌రించిన టీఆర్ ఎస్ అభ్య‌ర్తి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి 97,006 ఓట్లు వ‌స్తే.. బీజేపీ అబ్య‌ర్థిగా కోమ‌టిరెడ్డికి 86,697 ఓట్లు వ‌చ్చాయి.

సో.. దీనిని బ‌ట్టి బీజేపీ పుంజుకుంద‌నే చెప్పాలి. ఇక్క‌డ సాధార‌ణంగానే ఒక ధ‌ర్మ సందేహం వ‌స్తుంది. రాజ‌గోపాల్‌రెడ్డి హ‌వాతోనే మునుగోడులో ఇన్ని ఓట్లు వ‌చ్చాయ‌ని అనేవారు ఉన్నారు. దీనిలో కొంత నిజం ఉండొచ్చు కానీ, ఆయ‌న ఇప్పుడు బీజేపీ నేత‌గానే బ‌రిలో నిలిచారు. అంతేకాదు.. క‌మ‌లం గుర్తుకు మునుగోడులో విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు. దీంతో ప్ర‌జ‌ల‌కు బీజేపీ చేరువ అయిందనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు 2018లో కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీ అనూహ్యంగా మూడేళ్ల‌లోనే ఈ రేంజ్లో పుంజుకోవ‌డం పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌న్న వాస్త‌వాన్ని క‌ళ్ల‌కు క‌డుతోంద‌ని అంటున్నారు.

నిజానికి 2018 వ‌ర‌కు టీఆర్ ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్తి పార్టీ కాంగ్రెస్‌. అయితే, దీని బెడ‌ద‌ను త‌గ్గించుకునేందుకు, త‌ప్పించుకునేందు కు ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను టీఆర్ ఎస్‌లో చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీని అనివా ర్యంగా బ‌ల‌హీన‌ప‌రిచారు. ఇక‌, కేసీఆర్‌ను ఎదిరించే నాయ‌కులు, పార్టీ కూడా లేద‌ని అనుకున్నారు. ఎందుకంటే అప్ప‌ట్లో కేవ‌లం రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉండ‌డం ఒక‌రిద్దరు మాత్ర‌మే బీజేపీ ఎంపీలుగా ఉండ‌డంతో సీఎం కేసీఆర్ ఈ అంచ‌నా వేసుకున్నారు. అయితే, త‌ర్వాత మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు ఉనికిలో లేని బీజేపీ.. పుంజుకునేలా చేశార‌నే వాద‌న కేసీఆర్ సైడే వినిపిస్తోంది.

ఎలా చూసుకున్నా.. హుజూరాబాద్‌, దుబ్బాక‌ల్లో గెలుపు బీజేపీకి స‌త్తువ నిస్తే.. ఇప్పుడు మునుగోడులో ఓడి గెలిచార‌న్న‌ వాద‌న ఆ పార్టీలోనే కాకుండా రాజ‌కీయంగా కూడా బ‌లంగా వినిపిస్తోంది. దెబ్బ‌తిన్న పాము ఊరుకోద‌న్న‌ట్టుగా.. బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత బ‌లం పుంజుకునే దిశ‌గా అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా.. అంద‌రూ ఫైర్‌బ్రాండ్స్‌. సో.. ఇప్పుడు టీఆర్ ఎస్ గెలిచినా.. ఓడిన బీజేపీ మాత్రం గెలుపు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంటే.. రాబోయే రోజుల్లో కేసీఆర్ అనుకున్నంత ఈజీగా అయితే సార్వ‌త్రిక స‌మ‌రం ఉండ‌ద‌ని మునుగోడు ఫ‌లితం స్ప‌ష్టం చేస్తోంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.