వైసీపీ మీడియా న‌వ్వుల‌పాలు

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇప్ప‌టం గ్రామంలో రెండు రోజులుగా న‌డుస్తున్న డ్రామాను అంద‌రూ చూస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు దారుణాతి దారుణంగా త‌యార‌వ‌గా.. కొత్త రోడ్లు వేయ‌డం సంగ‌తి అటుంచితే క‌నీసం గుంత‌లు కూడా పూడ్చ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణం న‌ర‌క‌ప్రాయంగా మారుతోంది. అలాంటిది రెండొంద‌ల ఇళ్లు ఉన్న గ్రామంలో రోడ్డు విస్త‌ర‌ణ పేరుతో ప‌దుల సంఖ్య‌లో ఇళ్ల‌ను కూల్చేయ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జ‌న‌సేన ప్లీన‌రీ స‌మావేశానికి త‌మ భూములు ఇచ్చార‌నే అక్క‌సుతో, ఇత‌ర కార‌ణాల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ద్ద‌తుదారుల‌ను టార్గెట్ చేస్తూ వారి ఇళ్ల‌ను కూల్చేశార‌న్న‌ది బాధితుల ఆరోప‌ణ‌. ఈ ఇష్యూను జ‌న‌సేన‌తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా క‌లిసి రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార్చాయి. త‌ట‌స్థులు కూడా చాలామంది ఈ విష‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

ఐతే ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేసేలా క‌నిపించ‌డంతో వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. ముఖ్యంగా సాక్షి మీడియా.. ఇప్ప‌టం గ్రామంలో కొంద‌రు ఎంపిక చేసిన పార్టీ మ‌ద్ద‌తుదారుల‌తో మాట్లాడించింది. రోడ్డు విస్త‌ర‌ణ‌తో గ్రామానికి మంచి చేయాల‌ని, అభివృద్ధి చేయాల‌ని చూస్తుంటే కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ కొంద‌రు సాక్షికి వీడియో బైట్స్ ఇచ్చారు. కానీ ఆ వీడియోలు వారితో పాటు అధికార పార్టీని, అనుకూల మీడియాను న‌వ్వుల పాలు చేసేలా ఉన్నాయి. ఒక వ్య‌క్తేమో కూల్చిన ఇంటిముందు నిల్చుని గ్రామంలో ఎవ‌రి ఇళ్ల‌నూ కూల్చ‌లేద‌ని అంటాడు. ఇంకో వ్య‌క్తేమో మా ప్ర‌హ‌రీ గోడ‌ను కూల్చేశారు బ్ర‌హ్మాండంగా ఉంది అని కామెంట్ చేస్తాడు. దీంతో స‌ద‌రు వీడియోలు సోష‌ల్ మీడియాలో కామెడీ అయిపోతున్నాయి.

ఇంకోవైపు గాంధీ, అంబేద్క‌ర్ లాంటి మ‌హాత్ముల విగ్ర‌హాలు, శివుడి గుడి ముందున్న నంది విగ్ర‌హం విస్త‌ర‌ణ‌కు అడ్డుగా ఉన్నాయ‌ని చెప్పి వాటిని తీయించి ప‌క్క‌న ప‌డేసి.. రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న వైఎస్ విగ్ర‌హాన్ని మాత్రం అలాగే ఉంచ‌డాన్ని జ‌న‌సేన‌, వైసీపీ మ‌ద్ద‌తుదారులు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెడుతుండ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు ద్వంద్వ ప్ర‌మాణాలు బ‌య‌ట‌ప‌డిపోతున్నాయి.