ఆధిక్యంలో టీఆర్ఎస్‌.. బీజేపీలో హై టెన్ష‌న్‌?

రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలలో.. టీఆర్ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లోనూ అధికారపార్టీ జోరు చూపించింది. ఫలితంగా 2,169 ఓట్ల ఆధిక్యంతో పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. టీఆర్ ఎస్‌కు 38,521 ఓట్లు రాగా..బీజేపీకి 36,352 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతికి 11,894 ఓట్లు మాత్రమే వచ్చాయి. రౌండ్ రౌండ్‌లోనూ టీఆర్ ఎస్ అభ్య‌ర్థి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో బీజేపీలో హై టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

అంతకుముందు చౌటుప్పల్ మండలానికి సంబంధించి.. 4 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌లో బీజేపీపై టీఆర్ఎస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. రెండు, మూడో రౌండ్‌లలో టీఆర్ ఎస్‌పై బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక, ఆఖరి నాలుగో రౌండ్‌లో బీజేపీపై టీఆర్ ఎస్‌ ముందంజలోకి వచ్చింది. మొత్తంగా చౌటుప్పల్‌కు సంబంధించి నాలుగు రౌండ్‌లలో టీఆర్ ఎస్‌, బీజేపీ.. చెరి సగం రౌండ్లలో ఆధిక్యతను ప్రదర్శించాయి.

చౌటుప్పల్‌ మండలం లెక్కింపు పూర్తి కావడంతో సంస్థాన్‌ నారాయణపురం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ 5, 6 రౌండ్లను టీఆర్ ఎస్‌ కైవసం చేసుకుంది. ఏదేమైనా రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఫ‌లితం.. ఆది నుంచి అనుకున్న విధంగానే బీజేపీ-టీఆర్ఎస్‌ల మ‌ధ్య‌నువ్వా-నేనా అన్న‌ట్టుగా ట‌గ్ ఆఫ్ వారు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 15 రౌంట్ల కౌంటింగ్ పూర్త‌యితే త‌ప్ప‌..మునుగోడు ఎవ‌రిద‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.