త‌మిళ‌నాట రాజ‌ధాని విస్త‌ర‌ణ‌.. మ‌రి ఏపీకి లెస్స‌న‌వుతుందా?


ఏపీలో రాజ‌ధాని వివాదం కొన‌సాగుతూనే ఉంది. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లు అయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఇటుక పేర్చ‌లేదు. ఒక్క త‌ట్టెడుమ‌ట్టి కూడా ఎత్త‌లేదు. ఇది అంద‌రికీ తెలిసిందే. కానీ, జ‌గ‌న్ త‌ర్వాత అధికారం చేప‌ట్టిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో అన్న‌డీఎంకే ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్పుడు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అది కూడా రాజ‌ధాని విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై. ఇది రాజ‌ధానిగా ఉంటూనే ఈ న‌గ‌రాన్ని మెట్రోపాలిట‌న్ ప్రాంతం చేశారు. అయితే, జ‌నాభా పెరుగుతున్నందున రాజ‌ధానిని విస్త‌రించాల‌ని అప్ప‌టి ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంటే.. మెట్రోపాలిట‌న్ న‌గ‌రాన్ని మ‌రింత విస్త‌రించి.. రాజ‌ధాని స్వ‌రూపం చెడిపోకుండా అభివృద్ధి చేయాల‌నేది ప్ర‌తిపాద‌న‌.

ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, తిరుపతి దాటి దాదాపు 100 నుంచి 120 కిలోమీట‌ర్లు వెళ్తే త‌ప్ప చెన్నై మెట్రోపాలిట‌న్ సిటీ క‌నిపించ‌దు. కానీ, దీనిని విస్త‌రించి మేలు చేయాల‌ని ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం 2018లో నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇప్పుడు స్టాలిన్ దీనిని అమ‌లు చేస్తున్నారు. దీని ప్ర‌కారం ఇప్పుడు చిత్తూరు, తిరుప‌తి స‌రిహ‌ద్దుల వ‌ర‌కు చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతం చేరుతుంది. ఈ మేరకు నగరాన్ని భారీగా విస్తరిస్తూ తమిళనాడు ప్రభుత్వం అధినేత స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చ.కి.మీ.గా ఉంది. ఇప్పుడు దాన్ని ఏకంగా 5,904 చ.కి.మీ.కు పెంచుతూ గెజిట్‌ విడుదల చేశారు. ఈ నిర్ణ‌యం ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎంతో మేలు చేస్తుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని విస్తరించడంతో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు, వాటి చుట్టుపక్కలున్న ప్రాంతాలకు ఉపాధి వనరులు మరింతగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్‌ మార్పు ప్రక్రియ నడుస్తోంది.

విష‌యం ఏంటంటే..

ఏపీలో మాదిరిగా గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఉక్కుపాదం మోపాల‌ని.. అక్క‌డ సీఎం స్టాలిన్ భావించ‌డం లేదన్న‌ది తెలిసిందే. అమ్మ క్యాంటీన్లే దీనికి ఉదాహ‌ర‌ణ‌. అంతేకాదు.. ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం దివ్యాంగుల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల ట్రై సైకిళ్ల‌నుకొనుగోలు చేసి.. త‌మ పార్టీ గుర్తులు వేసుకున్నారు. ఇంతలో ఎన్నిక‌లు వ‌చ్చాయి.స్టాలిన్ అధికారంలోకి వ‌చ్చారు. వ‌చ్చీ రాగానే ఈ సైకిళ్ల‌ను ల‌బ్దిదారులైన దివ్యాంగుల‌కు అందించారు. ఎక్క‌డా వాటిపై రంగులు కూడా మార్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. త‌న ఫొటో కూడా వేసుకోలేదు. ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో ప‌ళ‌ని స్వామి స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్నే ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌ల‌కు మేలు అంటే ఇదీ.. అంతే త‌ప్ప రాజ‌కీయ క‌క్ష‌లు కాద‌ని మ‌రోసారి స్టాలిన్ నిరూపించారు.