మునుగోడు: కాంగ్రెస్ ఓటుపై టీఆర్ఎస్‌, బీజేపీ క‌న్ను!

మునుగోడు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ ఎస్, బీజేపీలు ఒక్క ఓటును కూడా చేజారి పోకుండా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా.. గ‌త 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో త‌మ‌కు ప‌డ‌ని ఓట్లు ఎన్ని.. పొరుగు పార్టీ అప్ప‌ట్ల‌లో బ‌లంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌కు వ‌చ్చిన ఓట్లెన్ని అనే విష‌యాల‌పై దృష్టి పెట్టాయి. ఇలా.. త‌మ‌కు వీక్‌గా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. వాస్త‌వానికి దీనిపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తున్నా.. ఇప్పుడు మ‌రింత ఎక్కుగా వ్యూహాల‌ను వేగవంతం చేశాయి.

టీఆర్ఎస్ అడుగులు వేగం..

గత ఎన్నికల్లో మునుగోడు, చండూరు మండలాల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి టీఆర్ఎస్‌ కంటే 11,280 ఓట్లు అధికంగా వచ్చాయి. కాంగ్రెస్‌కు అప్ప‌ట్ల‌లో మొత్తం మెజార్టీ 22,552 కాగా అందులో రెండు మండలాల్లోనే సగం మెజార్టీ రావడం విశేషం. దీంతో ఆ మెజారిటీని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌తివ్యూహాలతో రెడీ అయింది రెండే రోజులు ప్ర‌చారానికి స‌మ‌యం ఉన్న ద‌రిమిలా మండ‌లాల్లోని ప్ర‌తి ఇంటినీ చెరిగేయాల‌ని, ప్ర‌తి ఓట‌రునూ టార్గెట్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

మునుగోడు మండలంలో గత ఎన్నికల్లో 6,053 ఓట్లు టీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వ‌చ్చాయి. ప్రస్తుతం న‌గ‌ర పంచాయ‌తీగా మారిన‌ చండూరులో 5,227 ఓట్లు కాంగ్రెస్‌కు అప్ప‌ట్లో ఎక్కువ ప‌డ్డాయి. అదేవిధంగా మర్రిగూడ మండలంలోనూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు సుమారు 4 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ మూడు మండలాలనే టీఆర్ఎస్ ల‌క్ష్యంగా చేసుకుని అడుగుల వేగం పెంచింది. ఆయా మండ‌లాల్లో భారీ మెజారిటీ సాధించే విధంగా అధికార పార్టీ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటూ ముఖ్య నాయకులు ఇప్పటికే ఇన్‌ఛార్జ్‌లుగా తమకు కేటాయించిన ఎంపీటీసీ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని గత వారం రోజులుగా కొనసాగిస్తున్నారు. ఒక్కో ఇంటికి ఇప్పటికే పదిసార్లు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కొన్ని చోట్ల మూడు వేల ఓట్లు ఉంటే వాటిని 500 చొప్పున ఓట్లను విభజించి ఆరుగురికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ టీఆర్ ఎస్‌దే పైచేయి కావాలనే ధీమాతో వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

బీజేపీ ప్ర‌తివ్యూహం..

మరోవైపు మునుగోడును ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట ఆ ఓట్ల‌న్నీ త‌మ‌కు ప‌డేవిధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పుడు బీజేపీలో చేరడంతో వారి పరిధిలోని ఓట్లన్నీ రాజ‌గోపాల్‌రెడ్డికే పడాలని, అందుకు ఒక్కో ఓటరును ప్రత్యేకంగా కలవాలని పార్టీ ఆదేశించింది.

పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఆదరణ ఉన్న దృష్ట్యా ప్రస్తుతం న‌గ‌ర పాల‌క సంస్థ‌గా మారిన చౌటుప్పల్, చండూరులో బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాంతాల్లోనే పార్టీ ముఖ్య నేతల సభలు, రోడ్‌షోలు ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు 40 శాతం ఓటర్లుండటం కూడా పార్టీ ఇక్కడే దృష్టి పెట్టడానికి కారణంగా తెలుస్తోంది. ఈ రెండు రోజులు ఇక్క‌డే నాయ‌కులు తిష్ట వేయాల‌ని సంక‌ల్పించారు. భోజ‌నం, నిద్ర కూడా ఇక్క‌డే ఉండాల‌ని భావిస్తున్నారు.