2024 ఎన్నిక‌లే టార్గెట్‌గా జ‌గ‌న్ కొత్త టాస్క్ అదిరిపోలే…!

వైసీపీ వ్యూహాల‌మీద వ్యూహాలు పన్నుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను వివిధ ప‌థ‌కాల‌తో ఆక‌ర్షించిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు సామాజిక వ‌ర్గాల వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా త్వ‌ర‌లోనే క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. కులాల వారిగా ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్ల నుంచి సుమారు 56 క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటికి.. మంత్రుల‌ను చైర్మ‌న్‌లుగా నియ‌మించనున్నారు.

వీరు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. కేవ‌లం త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌ను క‌లిస్తే.. స‌రిపోతుంది. వారిని త‌మ పార్టీకి అనుకూలంగా మార్చ‌డ‌మే వీరికి పార్టీ ఇస్తున్న ప్ర‌ధాన టాస్క్‌. ఆయా సామాజక వర్గాల స‌మ‌స్య‌ల‌ను మ‌రింత‌లోతుగా అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. వాటి ప‌రిష్కారంపైనా ఈ క‌మిటీలు దృష్టి పెట్ట‌నున్నాయి. అంతేకాదు.. సామాజిక వ‌ర్గాల‌తో త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న కార్తిక మాసం.. సంద‌ర్భంగా.. వ‌న భోజ‌నాలు ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి అయ్యే ఖ‌ర్చుల‌ను మంత్రులే భ‌రించాల్సి ఉంటుంది.

ఒక్కొక్క సామాజిక వ‌ర్గం నుంచి ఎంత మంది మంత్రులు ఉంటారో.. వారంతా దీనిలో భాగం కావాలి. వారు తమ సామాజిక వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రిస్తామ‌నే న‌మ్మకం క‌ల్పించ‌డంతోపాటు.. వారిలో ప్ర‌భుత్వంపై ఉన్న అప‌న‌మ్మ‌కాన్ని కూడా.. తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేయాలి. అదేస‌మ‌యంలో సామాజిక వర్గాల‌కు ప్రాధాన్యం లేద‌ని.. భావిస్తున్న బ్రాహ్మ‌ణ వ‌ర్గంలో బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వాడ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అప్ప‌గిస్తున్నార‌ట‌. ఈయ‌న ఆ వ‌ర్గాన్ని ముందుకు న‌డిపించాలి. ఇక‌, వైశ్య వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ తీసుకోనున్నారు.

ప్ర‌స్తుతం క్షత్రియ వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను.. మాజీ మంత్రి.. శ్రీరంగ‌నాథ‌రాజుకు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో మంత్రి వ‌ర్గంంలో క‌మ్మ‌ల‌కు చోటు ఇవ్వ‌లేదు. దీంతో ఈ వ‌ర్గాన్ని పార్టీవైపు తిప్పుకొనేందుకు వ‌ల్ల‌భ‌నేని వంశీకి కానీ, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కానీ.. అప్ప‌గిస్తార‌ని.. తెలుస్తోంది. ఎవ‌రికి బాధ్య‌త అప్ప‌గించినా.. అంద‌రూ క‌లిసి.. వ‌న స‌మారాధ‌న‌లు నిర్వ‌హించి.. ఆయా వ‌ర్గాల‌ను పార్టీవైపు మ‌ళ్లించ‌డమే ప్ర‌ధాన ల‌క్ష్యం. గ‌తంలో అంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. వైసీపీ ఈ వ్యూహాన్ని అమ‌లు చేసి.. స‌క్సెస్ అయింది. దీంతో ఇప్పుడు కూడా.. ఇదే వ్యూహం అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.