అరెరె… ఈ ఐడియా 10 రోజు ముందు ఇచ్చి ఉంటే

ఓవైపు హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తుంటే.. అదే సమయంలో నగర నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చే పనిలో ప్రభుత్వం పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఈ పని అవసరమా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

ఈ పని కరోనా కోసం ఎంతో కష్టపడుతున్న వైద్యులకు, కరోనాతో అవస్థలు పడుతున్న జనాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటూ ప్రశ్నించారు విజయలక్ష్మి అనే వైద్యురాలు. కరోనాపై పోరులో అత్యంత కీలకంగా మారిన వైద్యులు.. అప్పుడప్పుడూ తమ ఆవేదన వెళ్లగక్కుతూ, జనాలతో పాటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ వీడియో బైట్లు ఇస్తున్నారు. విజయలక్ష్మి అనే వైద్యురాలు కూడా ఇలాగే తన ఆవేదనను వెళ్లగక్కారు. తెలంగాణ ప్రభుత్వానికి చురుక్కుమనిపించేలా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా బారిన పడ్డ మంత్రులు, నాయకులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని.. వారి లాగే సామాన్య జనాలకు కూడా తమ ప్రాణాల మీద తీపి ఉండదా అని డాక్టర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ఐతే జనాలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి భయపడుతున్నారని.. అందుక్కారణం అక్కడ వసతులు లేకపోవడమే అని ఆమె అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు, వసతులు లేవని.. ఈ కష్ట కాలంలో నగర నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్ భవనాలను కోవిడ్ ఆసుపత్రులుగా ఉపయోగించుకుని ఉంటే ఎంతో బాగుండేదంటూ ఆలోచన రేకెత్తించే మాట చెప్పారు. వేరే రాష్ట్రాల్లో స్కూళ్లు, కళ్యాణ మండపాల్ని ఆసుపత్రులుగా మారుస్తున్నారని.. మన దగ్గర ఎందుకలా చేయట్లేదని ఆమె ప్రశ్నించారు.

కేంద్ర బృందం వచ్చిందని టిమ్స్ ఆసుపత్రిని ముస్తాబు చేశారని.. కానీ ఆ ఆసుపత్రిని ఎందుకు పేషెంట్ల కోసం అందుబాటులోకి తేలేదని ఆమె అడిగారు. జనాలు కరోనాతో అల్లాడుతున్న సమయంలో సెక్రటేరియట్‌ను కూలగొట్టే పని అవసరమా.. దాని కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, వ్యవస్థలన్నీ దాని మీద పని చేయాలా అని విజయలక్ష్మి ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న నిధులన్నీ కరోనా కోసమే వెచ్చించాలని ఆసుపత్రుల్లో వసతులు పెంచాలని, ఇలాంటివి అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.