ఏపీ మహిళా కమిషన్.. వివాదాలకు కేంద్రంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి రాజ్యాంగ బద్ధమైన సంస్థ కేంద్ర మహిళా కమిషన్. దీనిని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. అయితే.. దీని సూచనలమేరకు.. కేంద్రం ఏర్పాటు చేసిన కొన్నికమిటీల సూచనల మేరకు.. ఆయా రాష్ట్రాల్లోనూ మహిళా కమిషన్లను ఏర్పాటు చేశారు. వీటి ప్రధాన కర్తవ్యం.. మహిళలకు భద్రత కల్పించడం.. వారికి అవగాహన కల్పించడం.. వారిలో స్వయం చాలక శక్తిని ప్రోది చేయడం వంటివి కీలకంగా ఉన్నాయి. ఇక, రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు.. అన్ని చోట్లా ఉన్నాయా? అంటే.. లేవనే చెప్పాలి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ.. కర్ణాటక, కేరళల్లో మాత్రమే ఈ కమిషన్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో తొలిసారి నవ్యాంధ్రలో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో నన్నపనేనిరాజకుమారి .. చైర్ పర్స్‌గా నియమితులయ్యారు.
మహిళల పై దాడులను నిరోధించేందుకు.. మహిళల కష్టాలు తీర్చేందుకు.. కమిషన్ ఎంతో ప్రయత్నిస్తోందనే వాదనను ఆమె చేసి చూపించారు. అయితే.. వైసీపీ హయాంలో తొలి ఏడాది తర్వాత.. ఏర్పాటు చేసిన మహిళా కమిషన్‌కు.. వాసిరెడ్డి పద్మను నియమించారు. ఈమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పామని.. ఈ ఏడాది మార్చిలో వచ్చిన మహిళా దినోత్సవం సందర్భంగా.. సీఎం పేర్కొన్నారు. కానీ, మహిళా కమిషన్ మాత్రం రాజకీయ కేంద్రంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.
తన వారి పట్ల దాడులు జరిగితే.. ఒక విధంగా పొరుగు వారి పట్ల జరిగితే మరోవిధంగా స్పందిస్తోందనే.. వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ మహిళా నాయకుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినప్పడు.. అసలు ఆమె పట్టించుకోలేదు. మరోవైపు.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ ఎపిసోడ్‌లోనూ.. ఆచి తూచి వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే.. ఆయన విషయంలో సీరియస్‌గా ఉన్నారని.. ఇది ఏమాత్రం సమంజసం కాదని.. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ రాజకీయ బందీగా మారిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.